Megastar Chiranjeevi: ‘భోళాశంకర్’ దెబ్బకు భారీ నష్టం?
ముందు నుంచి మెగాస్టార్ ఫ్యాన్స్ అందరూ భయపడినట్లే 'భోళా శంకర్' ఫ్లాప్ అయింది. మొదటి రోజు మార్నింగ్ షోకే నెగటివ్ టాక్ తెచ్చుకుంది. వాల్తేరు వీరయ్యతో సాలిడ్ హిట్ కొట్టిన చిరుకి, మెహర్ రమేష్ అదే రేంజ్ ఫ్లాప్‌ని ఇచ్చాడు. ఫామ్‌లోని డైరెక్టర్‌తో అవుట్ డేటెడ్ స్టోరీతో రిస్క్ చేసి మెగా ఫ్యాన్స్‌ను డిసప్పాయింట్ చేశారు మెగాస్టార్. అంతేకాదు.. భోళా శంకర్‌తో భారీగా నష్టాలు చూడాల్సిందేనని అంటున్నారు.
మెగాస్టార్ నుంచి కావాల్సింది కామెడీ, యాక్షన్, ఎమోషన్, కలర్ ఫుల్ సాంగ్, డ్యాన్స్ మాత్రమేనని.. డైరెక్టర్ మెహర్ రమేష్ ఆలోచించినట్టున్నాడు. ఈ కోణంలోనే భోళా శంకర్‌ను తెరకెక్కించాడు మెహర్. కానీ డే వన్ నుంచి ఈ సినిమా పై విరుచుకుపడ్డారు నెటిజన్స్. పైగా హిట్ టాక్ తెచ్చుకున్న రజనీ కాంత్ ‘ జైలర్’ మూవీ.. భోళా శంకర్‌ని మరింత దెబ్బ తీసింది. దీంతో ఈ సినిమా భారీ నష్టాలను చూస్తుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. రోజుకి లక్షల్లో షేర్స్ వస్తుంటే.. ఈ చిత్రాన్ని థియేటర్లలోంచి తీసేస్తున్నారు. ఆరు రోజుల్లో కనీసం 30 కోట్ల షేర్ కూడా భోళా శంకర్ రాబట్టలేకపోయింది. మొత్తంగా ఇప్పటి వరకు 27 కోట్లు మాత్రమే వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం.
ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 80 కోట్ల వరకు బిజినెస్ చేసుకుంది. ఈ లెక్కన మరో 53 కోట్లు వస్తే గానీ భోళా శంకర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అవదు. ఎలా చూసుకున్నా ఈ సినిమా వల్ల యాభై కోట్లకు పైగానే నష్టం ఉంటుందని లెక్కలు వేస్తున్నారు. ఈ సినిమాను ఏకె ఎంటర్టైన్మెంట్స్ పై అనిల్ సుంకర భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. కానీ ఫైనల్‌గా భోళా శంకర్ యాభై కోట్లకు పైగా నష్టం తెచ్చిపెట్టేలా ఉందంటున్నారు. దీంతో అఖిల్ ఏజెంట్ సినిమా తర్వాత నిర్మాత అనిల్ సుంకరకు భోళా శంకర్ గట్టి దెబ్బేసిందనే చెప్పాలి.
ఇక భోళా శంకర్ రిజల్ట్‌తో మెగాస్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ రావడం లేదు. బంగార్రాజు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణతో సినిమా ఉంటుందని వినిపిస్తున్నా.. అది ‘బ్రో డాడీ’ రీమేక్ కావడంతో పక్కకు పెట్టేసినట్టు టాక్ నడుస్తోంది. దీంతో బింబిసార డైరెక్టర్ మల్లిడి విశిష్ట లేదా ఏఆర్ మురుగదాస్‌తో మెగాస్టార్ సినిమా చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే.. ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే చిరు బర్త్ డే ఆగష్టు 22 వరకు వెయిట్ చేయాల్సిందే.