ATP: పెద్దవడుగూరు మండలంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మార్గశిర మాసం బహుళపక్షం ఏకాదశి పురస్కరించుకుని స్వామివారికి పంచామృతాభిషేకములు, విష్ణు అష్టోత్తర శతనామావళి, పలు పూజ కార్యక్రమాలు చేశారు. అనంతరం వివిధ పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు.
TG: యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి దేవాలయంలో స్వామివారి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక అభిషేక పూజలు, ఏకాదశ లక్ష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించారు. భక్తుల నమో నారసింహ, గోవింద నామస్మరణలతో యాదగిరులు మార్మోగాయి. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఎంపీ చామల గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ASR: జీకేవీధి మండలం సీలేరు శ్రీ మారెమ్మ అమ్మవారికి తుని పట్టణానికి చెందిన కొరసాల సాయివినీల్ కాంత్, జాస్మిన్ దంపతులు గురువారం వెండి కిరీటాన్ని వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు దామోదర శర్మ మారెమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అమ్మవారికి వెండి కిరీటాన్ని అలంకరించారు.
శబరిమలలో రేపు అయ్యప్ప మండల పూజ నిర్వహించనున్నారు. నవంబర్ 16న ప్రారంభమైన మండల పూజ డిసెంబర్ 26న సన్నిధానంలో జరిగే ప్రత్యేక పూజలతో ముగియనుంది. మధ్యాహ్నం 12 నుంచి 12:30 గంటల మధ్య శబరిమల అయ్యప్ప ఆలయ ప్రధాన పూజారి కందారరు రాజీవారు మండల పూజను నిర్వహిస్తారు. క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో కేరళీయులు పెద్దసంఖ్యలో మండల పూజకు వచ్చే అవకాశం ఉంది. దీంతో NDRF బృందాలు భారీగా మోహరించాయి.
తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనానికి తిరుపతి, తిరుమలలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు జారీ చేయనున్నారు. జనవరి 10, 11, 12వ తేదీలకు సంబంధించి మొదటి మూడు రోజులకు జనవరి 9న ఉదయం 5 గంటల నుంచి 1.20 లక్షల టోకెన్లు జారీ చేస్తారు. తదుపరి రోజులకు ఏ రోజుకారోజు ముందు రోజు టోకెన్లు జారీ చేస్తామని ఈవో తెలిపారు.
ATP: బుక్కరాయసముద్రం మండలంలోని నీలంపల్లి గ్రామంలో వెలసిన శ్రీ నాగ మల్లేశ్వరస్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ధనుర్మాస బుధవారాన్ని పురస్కరించుకొని ఆలయ పూజారి అభిషేకాలు, అర్చనలు, మహామంగళహారతి తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు విరివిగా హాజరై స్వామి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి ఆలయంలో బుధవారం భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి ఆలయంలో వివిధ సేవల ద్వారా రూ.2,49,310 ఆదాయం లభించిందని ఆలయ కార్యనిర్వహణాధికారి సత్యనారాయణరాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 476 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. 1960 మంది భక్తులు అన్న ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు.
టీటీడీకి ఓ భక్తుడు భారీ విరాళం అందజేశాడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఈవో పీఎంఎస్ ప్రసాద్ తిరుమల శ్రీవారి అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.1,11,11,111 విరాళంగా అందించారు. ఈ మేరకు విరాళం డీడీని శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరికి ఇచ్చారు. అయితే, ఇటీవల తిరుపతికి చెందిన ఓ వ్యాపారి స్వామివారికి రూ.కోటి అందజేసిన విషయం తెలిసిందే.
శ్రీకాకుళం జిల్లా నర్సంపేట పట్టణంలో గల సిద్ధాశ్రమంలో బుధవారం జరిగిన అయ్యప్ప స్వామి మండల పూజా కార్యక్రమంలో రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతోపాటు ఎంపీపీలు వైసీపీ పార్టీ నేతలు పలువురు పాల్గొన్నారు.
AP: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతుంది. భవానీ దీక్షల విరమణకు చివరిరోజు కావడంతో భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు అన్ని క్యూలైన్లలోనూ ఉచిత దర్శనం కల్పిస్తున్నారు. దర్శనానికి దాదాపు 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. అలాగే, భవానీ ఘాట్, పున్నమి ఘాట్, సీతమ్మవారి పాదాల సమీపంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక తలనీలాలశాల వద్ద భక్తులు తలనీలాలు సమర్పిస్తున్నారు.
AP: తిరుమల శ్రీవారి దర్శనం కోసం మార్చి కోటా టికెట్లను టీటీడీ ఇవాళ విడుదల చేసింది. ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టిక్కెట్లను ఆన్లైన్లో భక్తులకు అందుబాటులో ఉంచింది. రేపు ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, అద్దె గదులు బుక్ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. 27న శ్రీవారి సేవా కోటా టికెట్లు రిలీజ్ కానున్నట్లు పేర్కొంది.
NLR: దగదర్తి పట్టణంలోని శ్రీదుర్గా భవాని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో మంగళవారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి పంచామృత అభిషేకం, అమ్మవారికి కుంకుమ పూజ చేశారు. భక్తులు స్వామి, అమ్మవార్లును దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
SKLM: పట్టణంలోని బలగ నాగావళి నది తీరాన కొలువైన శ్రీ బాల త్రిపుర కాలభైరవాలయంలో కాలభైరవ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని గ్రామ పుర వీధుల్లో తిరువీధి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, స్వామిని దర్శించుకున్నారు.
శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; హేమంత రుతువు, మార్గశిరమాసం, బహుళపక్షం దశమి: రా. 9-24 తదుపరి ఏకాదశి చిత్త: మ. 3-07 తదుపరి స్వాతి వర్జ్యం: రా. 9-18 నుంచి 11-04 వరకు అమృత ఘడియలు: ఉ. 8-01 నుంచి 9-48 వరకు దుర్ముహూర్తం: ఉ 11-37 నుంచి 12-21 వరకు రాహుకాలం: మ. 12-00 నుంచి 1-30 వరకు సూర్యోదయం: ఉ. 6.31; సూర్యాస్తమయం: సా.5.28.
AP: నంద్యాల జిల్లా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున క్షేత్రంలో జనవరి 1న స్వామివారి స్పర్శదర్శనం రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. న్యూఇయర్ సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భక్తులకు ఆ రోజు అలంకార దర్శనాలు కల్పిస్తామన్నారు. సర్వదర్శనం క్యూలైన్లలో భక్తులకు ఇబ్బందులు లేకుండా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.