భారత్(India)లోని పలు దేవాలయాలు(Temples) డ్రెస్ కోడ్(Dress Codes)ను అమలు చేస్తున్నాయి. దైవ దర్శనానికి వచ్చేవారు సాంప్రదాయ దుస్తుల్లో రావాలని సూచిస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, డెహ్రాడూన్, రిషికేష్ ఆలయాలకు పొట్టి దుస్తులతో వచ్చేవారిని నిషేధిస్తున్నట్లు మహానిర్వాణి పంచాయతీ అఖారా వెల్లడించింది. హరిద్వార్‌లోని దక్షప్రజాపతి ఆలయం, డెహ్రాడూన్‌లోని తప్కేశ్వర్ మహాదేవ్ ఆలయం, నీలకంఠ ఆలయం పౌరి, రిషికేష్‌లోని మహాదేవ్ ఆలయాలు డ్రెస్ కోడ్‌ను అమలు చేస్తున్నాయి. ఉత్తర భారతదేశంలోని ఆలయాల్లో ఇలాంటి డ్రెస్ కోడ్(Dress Codes) అమలులోకి రావడం ఇదే మొదటి సారి కావడం విశేషం.
దక్షిణాదిలోని పలు దేవాలయాల్లో ఇప్పటికే డ్రెస్ కోడ్(Dress Codes) విధానం అమల్లో ఉంది. తిరుమలలోని శ్రీవారి ఆలయంలోకి ఎవరూ టీషర్ట్, పొట్టి బట్టలు వేసుకుని రాకూడదు. మహిళలు చీర లేకుంటే సల్వార్ సూట్ వంటివి ధరించాలని, పురుషులు షాట్స్ వేసుకోకూడదని ఆలయాధికారులు సూచించిన సంగతి తెలిసిందే.
కర్ణాటకలోని గోకర్ణ జిల్లాలో మహాబలేశ్వర్ ఆలయం ఉంది. ఈ శివాలయం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచింది. కర్ణాటకలోని ఏడు విముక్తి ప్రదేశాలలో ఈ ఆలయం ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడ పురుషులు ధోతీ ధరించి మాత్రమే దర్శించుకోవాలి. మహిళలు చీర లేదా సల్వార్ సూట్ ధరించి ఆలయానికి రావాలి. లేకుంటే ఆలయ సిబ్బంది అనుమతించరు.
ఘృష్ణేశ్వర్ మహాదేవ్ ఆలయం మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఉంది. ఈ ఆలయం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రఖ్యాతి గాంచింది. ఈ ఆలయంలోకి ప్రవేశించాలంటే కచ్చితంగా స్త్రీపురుషులు సాంప్రదాయ దుస్తుల(Dress Codes)తో రావాలి. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాల్ ఆలయానికి దర్శనం కోసం వెళ్తే కచ్చితంగా సాంప్రదాయ దుస్తులు ధరించాలి. గర్భగుడిలోకి వెళ్ళడానికి స్త్రీలకు చీర లేదా సల్వార్ సూట్, పురుషులు ధోతి కచ్చితంగా ధరించి ఉండాలి.