»Tragedy Within A Few Hours Of The Wedding Five People Including The Bride And The Groom Died
Accident: పెళ్లి జరిగిన కొన్ని గంటల్లోనే విషాదం.. వధువు, వరుడితో సహా ఐదుగురు మృతి
వివాహం చేసుకున్న ఓ నవ వధువు, వరుడు తమ ఇంటికి కారులో బయల్దేరారు. ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన వారు కొన్ని గంటల్లోనే ప్రమాదానికి గురై ప్రాణాలు వదిలారు. ఈ ప్రమాదంలో మొత్తం 5 మంది చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.
పెళ్లి జరిగిన కొన్ని గంటల్లోనే విషాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో వెళ్తున్న కారును లారీ ఢీకొంది. ఈ ఘోర ప్రమాదంలో వధువు, వరుడితో సహా ఐదుగురు మృతిచెందారు. ఈ ఘటన రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఛత్తీస్‌గఢ్ లోని జాంజ్ గిర్ చంపా జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. బలోడా గ్రామానికి చెందిన శుభమ్ సోనీ అనే వ్యక్తికి శివనారాయణ్ టౌన్‌కు చెందిన మహిళతో వివాహం అయ్యింది. శనివారం రాత్రి ఆ జంటకు పెళ్లి కాగా వారితో పాటు మరో ముగ్గురు వరుడి గ్రామానికి బయల్దేరారు.
వధువు, వరుడితో పాటు మరో ముగ్గురు కారులో వస్తుండగా ముల్ముల పోలీస్ స్టేషన్ పరిధిలోని పకారియా ఝులన్ గ్రామ సమీపంలో వారు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ కారు ప్రమాదంలో నవ జంట, వరుడి తండ్రి ఓం ప్రకాష్ సోనీ, మరో ఇద్దరు ప్రాణాలు వదిలారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కారును ఢీకొట్టిన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నారు. లారీ డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.