Food Poison : ఒడిశాకు చెందిన ముగ్గురు వలస కూలీలు కలుషిత ఆహారం, కలుషిత నీరు తాగి మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం గౌరెడ్డి పేటలో చోటుచేసుకుంది. ఎంఎస్ఆర్ ఇటుక బట్టీలో పనిచేస్తున్న 19 మంది కార్మికులు కలుషిత ఆహారం తిని ఆసుపత్రి పాలయ్యారు. పలువురు కూలీల పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కరీంనగర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ ముగ్గురు కార్మికులు మృతి చెందారు.
మిగిలిన 13 మంది కార్మికులు కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అస్వస్థతకు గురైన మరో నలుగురు కార్మికులు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ కార్మికులు మృతి చెందారని, అనారోగ్యం పాలయ్యారని కార్మికులు ఆరోపిస్తున్నారు. బట్టీ యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.