Food Poison : మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. ఓ మతపర కార్యక్రమంలో ప్రసాదం తిని దాదాపు 500 మంది అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని లోనార్ సోమతన గ్రామంలో వారం రోజులుగా ‘హరిణం సప్త’ అనే కార్యక్రమం జరుగుతుంది. మంగళవారం చివరి రోజు కావడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ పంచిన ప్రసాదం తిని అక్కడి ప్రజలంతా అస్వస్థతకు గురయ్యారు. ప్రసాదం తినగానే అందరికీ కడుపునొప్పి, వాంతులు అయ్యాయి. వారందరినీ చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. జనం ఎక్కువగా ఉండడంతో ఆస్పత్రిలో గదులు సరిపోక బయట రోడ్డుపైనే వైద్యం అందిస్తున్నారు. వారందరి ఆరోగ్యం నిలకడగా ఉందని బుల్దానా కలెక్టర్ కిరణ్ పాటిల్ తెలిపారు.