కాలిఫోర్నియాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ‘హాప్ మూన్ బే’ పట్టణంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు విడిచారు. మూడు రోజుల వ్యవధిలోనే ఇలా రెండోసారి కాల్పులు జరగడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ కాల్పుల ఘటనలో చైనాకు చెందిన వ్యవసాయ కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. నిందితుడు 67 ఏళ్ల వ్యవసాయ కూలీ జావో చున్లీ అని అధికారులు గుర్తించారు. తోటి వర్కర్లపై అతడు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు.
నిందితుడు ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నాడని, అతడిని విచారిస్తున్నట్లు శాన్ మేటో కౌంటీ పోలీసులు తెలిపారు. అయితే కాల్పులు జరగడానికి స్పష్టమైన కారణం తెలియాల్సి ఉంది. రెండు రోజులకు ముందు కాలిఫోర్నియాలోని మోంటెరీ పార్క్ లో చైనా న్యూ ఇయర్ వేడుకల్లో కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో 10 మంది మరణించారు. ఆ ఘటనకు కారణమైన నిందితుడు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఘటన మరువకముందే మరో ఘటన జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.