Fake Messages: మెసేజ్‌లతో మోసం..నగల వ్యాపారి ఖాతా ఖాళీ
ఫేక్ మెస్సేజెస్, కాల్స్ తో చాలా ఇబ్బంది పడుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఫేస్ మెస్సేజుల ద్వారా డబ్బులను సైబర్ నేరగాళ్లు దోచేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఢిల్లీలో చోటుచేసుకుంది. ఉత్తుత్తి మెస్సేజ్ పెట్టి ఓ నగల వ్యాపారిని బురిడీ కొట్టించారు.
బ్యాంకు అకౌంట్లో (Bank Accounts) డబ్బులు వేసినట్లు ఫేక్ మెస్సేజ్ (Fake Messages)లు పంపి ఓ నగల వ్యాపారిని బురిడీకొట్టించిన ఘటన ఢిల్లీ (Delhi)లో చోటుచేసుకుంది. నగరంలో కిశోర్ ఖండేల్వాల్ 50 ఏళ్ల నుంచి నగల వ్యాపారం చేస్తూ ఫేమస్ అయ్యారు. తాజాగా ఆయన దుకాణానికి ఓ వ్యక్తి వచ్చాడు. 15 గ్రాముల బంగారు గొలుసు (Gold Chain) కొంటానని ఆర్డర్ ఇచ్చాడు. ఆ తర్వాత తాను షాపు వద్దకు రావడం లేదని, డబ్బు పంపడానికి ఖండేల్వాల్ బ్యాంకు ఖాతా వివరాలను అడిగి తీసుకున్నాడు.
కొంతసేపటికి నగల దుకాణం యజమాని ఖాతాకి రూ.93,400లు జమ అయ్యాయి. మెస్సేజ్ కూడా రావడంతో ఆ వ్యక్తి అడ్రస్‌కు చైన్ (Gold Chain) పంపించారు. అయితే ఆ మరుసటి రోజు అదే వ్యక్తి ఫోన్ చేసి మరో 30 గ్రాముల బంగారు గొలుసు కొని ముందురోజు లాగానే ఆ వ్యాపారికి రూ.1,95,400 జమ చేసినట్లుగా మెస్సేజ్ పంపించాడు. ఆ మెస్సేజ్ చూసిన నగల వ్యాపారికి నమ్మకం కుదిరింది. దీంతో ఆ చైన్ కూడా డెలివరీ చేశాడు.
ఖండేల్వాల్ తన ఫోనులో స్టేట్మెంటు (Bank Statement) చూసుకోగానే డబ్బులు రాలేదని తెలిసింది. వచ్చిన మెస్సేజ్ (Fake Messages)లను పరిశీలించగా అవి బ్యాంకు నుంచి వచ్చినవి కాదని తేలింది. దీంతో ఆ నగల యజమాని పోలీసులను ఆశ్రయించాడు. బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ సభ్యులంతా చాలా చోట్ల తమ వ్యాపారులు ఇలాంటి మోసాలకు గురవుతున్నట్లు పోలీసులకు తెలిపారు.