ఆధార్ కార్డు ద్వారా చాలా మంది నగదు విత్ డ్రా చేస్తుంటారు. అలాంటి వారు జాగ్రత్త. ఫింగర్ ప్రింట్స్ ద్వారా కొందరు కేటుగాళ్లు అకౌంట్లో ఉన్న నగదును ఖాళీ చేస్తున్నారు.
దేశంలో ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు (Aadhar Card) కచ్చితంగా ఉండాలి. పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకూ ఆధార్‌ను కేంద్రం తప్పనిసరి చేసింది. చాలాచోట్ల ఆధార్ ద్వారానే ఆన్లైన్లో డబ్బులు విత్‌డ్రా చేసే విధానం అమల్లో ఉండటంతో సీనియర్ సిటిజన్స్ ఆ విధానం వల్లే నగదు విత్‌డ్రా చేస్తున్నారు. అయితే ఈ విధానాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు కేటుగాళ్లు ఓ కొత్త వ్యూహంతో నగదు దోచేస్తున్నారు. ఆధార్ నంబర్‌తో నకిలీ ఫింగర్ ప్రింట్ సృష్టించి బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసుకుంటున్నారు.
తాజాగా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను తెలంగాణ (Telangana) సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీరి వెనక అతి పెద్ద ముఠా ఉందని పోలీసులు అనుమానించి దర్యాప్తు ముమ్మరం చేశారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సేల్ డీడ్ పత్రాల్లోని ఫింగర్ ప్రింట్స్ (Finger prints), ఆధార్ నెంబర్‌ను దొంగిలించి వాటి ద్వారా ఆన్లైన్లో నగదు విత్‌డ్రా (Withdraw) చేసేస్తున్నారు.
ఆ ముఠా సభ్యులకు రిజిస్ట్రేషన్ కార్యాలయంలోని కొందరు సిబ్బంది కూడా సహకరిస్తున్నట్లు విచారణలో తేలింది. ప్రస్తుతం వారిని కూడా సీఐడీ పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలిపారు. సెల్ డీడ్ నుండి ఫింగర్ ప్రింట్స్ కట్ చేసుకుని, ఆ ఫింగర్ ప్రింట్స్‌తో ఆర్టిఫిషియల్‌గా తయారయ్యే వేలిముద్రలను సిద్దం చేసి వాటితో ఆధార్ నంబర్‌ను జతచేసి నగదు దోచేస్తున్నారు.
ఈ కేసులో ఫింగర్ ప్రింట్స్ (Finger prints)ని తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను సిఐడీ (CID) పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. బీహార్ కు చెందిన రంజిత్ అనే వ్యక్తితోపాటు బెంగళూరుకు చెందిన అలం అనే వ్యక్తిని సిఐడి పోలీసులు అరెస్టు చేసి మిగిలిన ముఠా సభ్యుల కోసం కూడా గాలిస్తున్నారు.