ఆన్లైన్లో ఆర్డర్ చేసిన కేక్ తిని పదేళ్ల చిన్నారి మృతి చెందింది. పంజాబ్‌లోని పటియాలాకు చెందిన పదేళ్ల చిన్నారి మాన్వి పుట్టిన రోజు కేక్ తిని చనిపోయింది.
Cake: ఆన్లైన్లో ఆర్డర్ చేసిన కేక్ తిని పదేళ్ల చిన్నారి మృతి చెందింది. పంజాబ్‌లోని పటియాలాకు చెందిన పదేళ్ల చిన్నారి మాన్వికి ఇంటి సభ్యులు ఈ నెల 24న పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఈక్రమంలో పట్టణంలోని ఓ బేకరీ నుంచి ఆన్లైన్లో కేక్ ఆర్డర్ చేశారు. సాయంత్రం 7గంటలకు ఆ కేక్‌ను కట్ చేసి కుటుంబ సభ్యులంతా తిన్నారు. కేక్ తిన్న అందరూ రాత్రి 10 గంటలకల్లా అస్వస్థతకు గురయ్యారు. గొంతు తడారిపోతుందని మాన్వి మంచినీళ్లు తాగి నిద్రపోయింది.
ఉదయానికి ఆమె ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కేకు విషపూరితం కావడం వల్లే చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అక్కడ పోలీసు స్టేషన్లో బేకరీ యాజమానిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపారు. కేక్ నమూనాలను సేకరించి పరీక్షల కోసం పంపారు. నివేదికల బట్టి నిందితుడిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.