NZB: ధర్పల్లి ఎంపీపీ కార్యాలయంలో 10 గ్రామాలకు చెందిన 96 మంది వార్డు సభ్యులకు మంగళవారం రెండవ విడత శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. గ్రామీణ పరిపాలన వ్యవహారాలు, సభ్యుల బాధ్యతలపై ఐదు రోజుల పాటు శిక్షణ కొనసాగుతుందని ఎంపీడీవో లక్ష్మారెడ్డి తెలిపారు. వార్డు సభ్యులు తమ బాధ్యతలను తెలుసుకుని గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు.
WGL: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు సజావుగా జరుగడానికి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు మంగళవారం తెలిపారు. జిల్లా పరిధిలోని మొత్తం 94 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ముగ్గురు కంటే ఎక్కువ వ్యక్తులు చేరకూడదన్నారు. సభలు, ర్యాలీలు, సమావేశాలు, ధర్నాలు నిషేధమని వెల్లడించారు.
VKB: మోమిన్‌పేట్ మండలం అమ్రాదికలాన్‌లో శనివారం గుర్తుతెలియని దుండగులు అంబేద్కర్ విగ్రహంపై దాడి చేశారు. ఈమేరకు అంబేద్కర్ విగ్రహంపై దాడి చేసిన దోషులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని మండలంలోని అంబేద్కర్ సంఘాలు ఇవాళ మండి పడ్డాయి. లేని పక్షంలో మండలంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.
KMM: జిల్లాలో నేరాల తీరు మారుతోంది. వివాహేతర సంబంధాలు, ఆస్తి తగాదాల కోసం ప్రత్యర్థులను మట్టుబెట్టేందుకు కిరాయి ముఠాలను ఆశ్రయించడం ఆందోళన కలిగిస్తోంది. తమ చేతికి మట్టి అంటకుండా పని పూర్తి చేయాలని రూ. లక్షల సుపారీలు ఇస్తున్నా, పోలీసులు సాంకేతికతతో నిందితులను పసిగడుతున్నారు. ఇటీవలి యూట్యూబర్ హత్య ఇందుకు నిదర్శనం.
SRCL: నిజామాబాద్ జిల్లా బోధన్ కోర్టు న్యాయవాది జి.కళ్యాణిపై దాడికి నిరసనగా వేములవాడలో న్యాయవాదులు మంగళవారం కోర్టు విధులు బహిష్కరించారు. మహిళా న్యాయవాదిపై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిసె సదానందం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గడ్డం సత్య నారాయణరెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో పత్తి కొనుగోళ్లకు గడువును ఫిబ్రవరి 27 వరకు పొడిగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రకటించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ఆధ్వర్యంలో జరుగుతున్న పత్తి కొనుగోలు ప్రక్రియకు గడువును పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు.
HYD సైబర్ క్రైమ్ పోలీసులు ఆపరేషన్ ఆక్టోపస్ ద్వారా దేశ వ్యాప్తంగా భారీ నెట్‌వర్క్‌ను ఛేదించారు. 16 రాష్ట్రాల్లో దాడులు చేసి 104 మంది నిందితులను అరెస్ట్ చేయగా.. వీరిలో బ్యాంకు అధికారులు ఉండటం గమనార్హం. వీరిపై 1,055 కేసులు ఉండగా, ఇప్పటివరకు రూ.127 కోట్ల మోసాలకు పాల్పడ్డారు. నిందితుల నుంచి రూ.36 లక్షల నగదు, 200లకు పైగా మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
KNR: నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో రెండు నెలల పాప మృతికి కారణమైన వారిపై వెంటనే చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ స్టేజ్ వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు పూసల సంపత్ మాట్లాడుతూ.. అగ్రవర్ణ దురహంకారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు.
WNP: జిల్లా సర్వేశాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో నూతన లైసెన్స్‌డ్ సర్వేయర్లకు లైసెన్స్‌ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాబోయే రోజుల్లో ప్రజల భూ సమస్యల పరిష్కారంలో లైసెన్స్‌డ్ సర్వేయర్ల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. భూ సర్వే ప్రక్రియల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా చూడాలని సూచించారు.
NZB: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా కమ్మర్ పల్లి మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన మోర్తాడ్ ఉదయ్‌ని నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు కమలాకర్ తెలిపారు. ఈ రోజు నియమాక పత్రాన్ని అందజేసి ఎస్సీల సంక్షేమం కోసం పాటు పడాలని సూచించారు. ఉదయ్ మాట్లాడుతూ.. ఎస్సీల అభివృద్ధికి తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు.
NGKL: చారకొండ మండలంలోని ఎర్రవల్లి గ్రామంలో ఎర్రవల్లి-గోకారం రిజర్వాయర్లో ముంపునకు గురికాకుండా చూడాలని చేస్తున్న రిలే నిరాహార దీక్ష మంగళవారంతో 85 రోజులకు చేరుకుంది. అలాగే R&R ప్యాకేజీ ప్రాథమిక నోటిఫికేషన్ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని భూనిర్వాసితులు డిమాండ్ చేశారు. తమ భూములు తమకు కావాలని, తమ ఇళ్లు ముంపునకు గురి కాకుండా కాపాడాలని కోరారు.
MLG: మంగపేట మండలం నిమ్మగూడెం, రమణక్కపేట, దొమేడ గ్రామాల్లో మంగళవారం MGNREGA పనులను ఆయ గ్రామాల సర్పంచులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేసవి కాలంలో గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించే ఈ పథకం ద్వారా గ్రామీణులు ఆర్థికంగా బలోపేతం అవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామాల వార్డ్ మెంబర్లు ఉన్నారు.
SRD: గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని మాదారం గ్రామానికి చెందిన ఠాకూర్ పద్మాబాయ్ చికిత్స కోసం నిజాం ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సస్‌లో చేరగా, మెదక్ ఎంపీ రఘునందన్ రావు రూ.2,00,000 ఎల్ఓసిని కుటుంబ సభ్యుడు వికాస్ సింగ్‌కు అందించారు. కార్యక్రమంలో జిన్నారం మండల బీజేపీ అధ్యక్షుడు కొత్తకాపు జగన్ రెడ్డి, రమణ సింగ్ తదితరులు ఉన్నారు.
JGL: పెగడపల్లి మండల కేంద్రంలోని గల శ్రీ స్వయంబూ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భూమిని కొనుగోలు చేశారు. ఆలయ ఆవరణలో కమిటీ సభ్యులు, గ్రామస్థులు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఆలయానికి ప్రక్కనున్న కొండ శ్రీనివాస్ గౌడ్ చెందిన రెండు గుంటల భూమిని రూ. 17,10,000 వేలకు కొనుగోలు చేసినట్లు వాళ్ళ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్ తెలిపారు.
MDK: చిలిపిచేడ్ మండలం శిలాంపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులను నూతన సర్పంచ్ రాజేందర్ రెడ్డి, కార్యదర్శి అఖిల్ మంగళవారం ప్రారంభించారు. కూలీలకు పని కల్పించడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టినట్లు వారు పేర్కొన్నారు. అర్హులైన గ్రామస్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ రమేశ్, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.