ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ సోమవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా భారత రాజ్యాంగ పీఠిక ప్రతిని అందజేశారు. అనంతరం జిల్లాలోని పలు సమస్యలపై ఆయన దృష్టికి తీసుకెళ్లగా.. సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం ప్రతి సమస్యను ప్రజాప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు.
BDK: భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ సింగ్ జన్మదినం సందర్భంగా ఇవాళ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన కార్యాలయంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం లక్ష్మీపురం ప్రాంతంలో ఆర్గానిక్ పంటలను సాగుచేస్తూ ఆదర్శ రైతుగా నిలిచిన లక్ష్మీ రెడ్డి పంట యొక్క ప్రాముఖ్యతను ఆయనకు వివరించగా త్వరలోనే పంటలను వీక్షిస్తానని హామీ ఇచ్చారు.
SRPT పట్టణంలోని టౌన్ హాల్‌లో ఈనెల 25న పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించనున్నారు. సీఐ చరమందరాజు తెలిపారు. సర్కిల్ పరిధిలోని లారీ, ఆటో, స్కూల్ బస్, క్యాబ్ డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు, కళ్లద్దాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీ కే. నరసింహ, కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి హాజరుకానున్నారు.
KMM: రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడా పోటీల్లో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి, మొత్తం 39 పతకాలు సాధించడం అభినందనీయమని సీపీ సునీల్ దత్ పేర్కొన్నారు. ఇందులో 15 బంగారు, 8 వెండి, 16 కాంస్య పతకాలు ఉన్నాయి. క్రీడల పట్ల ఆసక్తిని కనబరుస్తూ కమిషనరేట్ పేరును రాష్ట్ర స్థాయిలో నిలబెట్టిన క్రీడాకారులను ఆయన అభినందించారు.
NRPT: పాలమూరు స్టేడియంలో జరిగిన రెండో రాష్ట్రస్థాయి సీఎం కప్ నెట్‌బాల్ పోటీల్లో ఉమ్మడి జిల్లా బాలుర జట్టు రన్నరప్‌గా నిలిచి రజత పతకం సాధించింది. క్రీడాకారుల ప్రతిభను డీవైఎస్వో వెంకటేశ్, జిల్లా అధ్యక్షుడు రమేశ్ శెట్టి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి జిల్లాకు పేరు తీసుకురావాలని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
NLG: అఖిల భారత బంజారా సేవా సంఘం మిర్యాలగూడ నియోజకవర్గం కమిటీ ఆధ్వర్యంలో MLGలో సోమవారం గిరిజన ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయం నుండి బంజారా భవన్ వరకు సాగిన ర్యాలీలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ, ఛైర్ పర్సన్ చిలుకూరి సుధ, గిరిజన నేతలు పాల్గొన్నారు.
NGKL: తెలంగాణ అస్తిత్వ పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న తెలంగాణ వికాస సమితి నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా నాగర్ కర్నూల్‌కు చెందిన ప్రముఖ కవి, ఉద్యమకారుడు సుబ్బయ్య నియమితులయ్యారు. గౌరవ అధ్యక్షుడిగా శ్రీనివాస్ కొనసాగనున్నారు. సుబ్బయ్య మాట్లాడుతూ.. తెలంగాణ ఆత్మగౌరవానికి విరుద్ధంగా జరిగే అప్రజాస్వామిక చర్యలను తమ సమితి నిరంతరం ప్రశ్నిస్తుందని అన్నారు.
KMR: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిపై గెలిచిన కాటిపల్లి రమణారెడ్డిపై కక్ష గట్టి కాంగ్రెస్ ప్రభుత్వం దుశ్చర్యలకు పాల్పడుతోందని ఎంపీ డీకే అరుణ విమర్శించారు. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రొటోకాల్ పాటించకుండా ఎమ్మెల్యేను రానివ్వకుండా చేస్తూ అవమాన పరుస్తున్నారని మండి పడ్డారు. వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ అనవసర రాద్ధాంతాలకు తెరలేపిందన్నారు.
PDPL: రామగుండం పరిధిలో ఇటీవల నిర్వహించిన డ్రంక్ &డ్రైవ్లో దొరికిన ఏడుగురిని గోదావరిఖని కోర్టులో సోమవారం హాజరు పరిచినట్లు ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు తెలిపారు. వారిలో ఆరుగురికి రూ. 2 వేల చొప్పున జడ్జి వెంకటేశ్ దుర్వా జరిమానా విధించారని, 2 సారి పట్టుబడిన ఓ వ్యక్తికి 3 రోజుల జైలు శిక్ష విధించినట్లు సీఐ తెలిపారు. అతడిని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించామన్నారు.
MLG: ఆశా వర్కర్ల శాంతియుత నిరసనలను అడ్డుకుని ముందస్తు అరెస్టులు చేయడం దుర్మార్గమని CITU జిల్లా మాజీ అధ్యక్షుడు ఎండి దావూద్ మండిపడ్డారు. ఎన్నికల ముందు వాగ్దానం చేసిన 18,000 ఫిక్స్డ్ వేతనం, హెల్త్ కార్డు, ప్రమాద బీమా హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని హెచ్చరించారు.
SRCL: లైసెన్సుడు సర్వేయర్లు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం 25 మంది సర్వేయర్లకు లైసెన్స్ పత్రాలు ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌తో కలిసి పంపిణీ చేశారు.
ADB: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్పోర్ట్స్ మీట్‌లో జిల్లాకు సంబంధించిన మహిళా కానిస్టేబుళ్లు రాణించి మూడు బంగారు, నాలుగు కాంస్య, ఒక రజత పతకం గెలుపొందడం జరిగిందని SP అఖిల్ మహాజన్ సోమవారం తెలిపారు. ఈ మేరకు మహిళా కానిస్టేబుల్‌లను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. జాతీయస్థాయి పోటీలో సైతం రాణించాలని SP ఆకాంక్షించారు.
HYD: శేరిలింగంపల్లిలో దోమల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు ఆందోళనకు దిగారు. చెరువుల్లో చెత్త ఎక్కువైపోయి, దోమలకు నిలయంగా మారిందని ఆరోపించారు. దోమల తెరతో నిరసన వ్యక్తం చేశారు. దోమల నివారణ మందు పిచికారి చేయడం మర్చిపోయారని, సిబ్బంది కూడా పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. ఇప్పటికే చాలామంది డెంగ్యూ జ్వరం బారిన పడ్డారని చెప్పారు.
KNR: శంకరపట్నం మండలం ఆముదాలపల్లి గ్రామానికి చెందిన ఎటపు సమ్మయ్య మృతి చెందగా, వారి కుటుంబానికి గ్రామ సర్పంచ్ తాళ్ల పెళ్లి మొగిలి రూ. 5,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మండల మాజీ అధ్యక్షులు పెద్ది శ్రీనివాస్ రెడ్డి, గడ్డం ఓదెలు, గ్రామపంచాయతీ సభ్యులు దొంగల మహేష్, దొంగల శ్రీనివాస్, రవి పాల్గొన్నారు.
JGL: హైదరాబాద్‌లో ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 28న జరిగే రాష్ట్ర మహిళా న్యాయవాదుల సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ కోరుట్ల కోర్టు ఆవరణలో సోమవారం కరపత్రాలు, గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సదస్సులో భారత న్యాయ వ్యవస్థ, ముఖ్య న్యాయ అంశాలపై మహిళా న్యాయవాదులకు అవగాహన కల్పిస్తారని రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గంగాధర్ తెలిపారు.