NRML: నర్సాపూర్ జీ మండలంలోని టెంబుర్ని గ్రామంలో రాబోయే హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ శుభ్రపరిచే పనులు, సంప్రదాయ అలంకరణలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో దేవాలయాన్ని తీర్చిదిద్దుతూ ప్రత్యేక పూజల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పండుగను వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు కొనసాగుతుండగా, గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
BDK: భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఇవాళ నుంచి శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 2 వరకు సాగే ఈ వేడుకల్లో భాగంగా 27న మహోన్నతమైన తిరుకళ్యాణ, 28న శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఉగాది పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, రక్షాబంధనం నిర్వహించనున్నారు. సాయంత్రం అంకురార్పణతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు.
SRD: సిర్గాపూర్ మండలం గైరాన్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని లొంక తండా గ్రామంలో పలుచోట్ల విద్యుత్ స్తంభాలకు ఎల్ఈడి బల్బులను నేడు అమర్చారు. ఈ పనులను స్థానిక సర్పంచ్ వినోద్ రాథోడ్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ పంచాయతీ పరిధిలోని మూడు తండాల్లో కూడా వీధి స్తంభాలకు కొత్త బల్బులు అమర్చుతున్నట్లు చెప్పారు.
MDK: అప్పుల బాధ తాళలేక ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజాంపేట మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండలానికి చెందిన పంజ సత్తయ్య (48) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు తనకున్న భూమిని అమ్మి ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్లు చేశాడు. అనంతరం కొత్త ఇంటి నిర్మాణం కోసం బ్యాంకులో 5 లక్షలు, బయట వ్యక్తుల వద్ద 10 లక్షల అప్పు చేశాడు.
MDCL: నేడు స్టాక్ మార్కెట్‌లో కుప్పకూలిన నేపథ్యంలో రేపు భారీ లాభాలు అర్జించే అవకాశం ఉంటుందని పలువురు ఫేక్ ఇన్వెస్టర్లు ఉప్పల్, నాచారం ప్రాంతాలకు చెందిన ట్రేడర్లకు కాల్స్, మెసేజెస్ చేస్తున్నట్లుగా తెలిపారు. అలాంటి మెసేజెస్ నమ్మితే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుందని, వాటికి దూరంగా ఉండటం మేలని సైబర్ పోలీస్ అధికారులు తెలిపారు.
వనపర్తి జిల్లా ప్రజలకు కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీత రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తీపి, పులుపు, చేదు, వగరు, ఉప్పు, కారంతో తయారు చేసిన ఉగాది పచ్చడిలాగే మనిషి జీవితంలో ఎదురయ్యే కష్టాసుఖాలు, ఆనందం బాధలన్నింటికీ ఉగాది పచ్చడి ప్రతీక అన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.
BHNG: పోచంపల్లిలో ఉగాది సందడి నెలకొంది. మార్కెట్లో కుండలు, మామిడాకులు, మామిడికాయలు, వేపాకు వేప పువ్వు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.. పెరిగిన ధరలతో పండుగ కొనుగోళ్ల భారంగా మారాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు మాత్రం అమ్మకాలు బాగున్నాయి చెబుతున్నారు.
KMM: ఈ నెల 22 నుంచి రైతుల ఖాతాల్లో యాసంగి రైతు భరోసా నిధులను జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎకరానికి రూ. 6 వేల చొప్పున తొలుత చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యతనిస్తూ నిధులు విడుదల కానున్నాయి. ఖమ్మం జిల్లాలో రూ. 3.58 లక్షల మంది రైతులకు రూ. 440.63 కోట్లు, కొత్తగూడెం జిల్లాలో రూ. 1.91 లక్షల మందికి రూ. 353.78 కోట్లు అందనున్నాయి.
మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాలో కరువు నివారణకు పంట పొలాలలో నీటి కుంటలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం 50 కోట్లు వెచ్చించనుంది. ఈ మూడు జిల్లాలలో మొత్తం 100 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేయగా మొదటి విడతగా 50 కోట్లు మంజూరయ్యాయి. బోరు బావులలో నీటిమట్టం పెంచడం, 24 గంటలు పంట పొలాలకు నీరు అందించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
KMR: బీర్కూర్ మండలంలోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో గురువారం ఉగాది పర్వదిన సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఆలయ పూజారి అభిషేక్ ఆచార్య పంచాంగ శ్రవణం భక్తులకు వినిపించారు. స్వామివారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి దంపతులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు.
SRD: మనూరు మండలం బోరంచ శివారు మంజీరా నది తీరంలో వెలిసిన నల్ల పోచమ్మ ఆలయంలో బుధవారం తెలుగు ఉగాది పండుగను జరుపుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు చేశారు. అనంతరం షడ్రుచుల ఉగాది పచ్చడిని పోచమ్మ తల్లికి నైవేద్యంగా సమర్పించారు. ఉగాది పచ్చడిని భక్తులకు వితరణ చేశారు. ఇందులో అర్చకులు సిద్దయ్య, సిబ్బంది శ్రీకాంత్ రెడ్డి, శేఖర్ ఉన్నారు.
ASF: ఉగాది, రంజాన్ పండుగలను పురస్కరించుకుని జిల్లా SP నితిక పంత్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘శ్రీ పరాభవ’ నామ సంవత్సరంలో అందరికీ శుభాలు కలగాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. జీవితంలోని కష్టసుఖాలను సమానంగా స్వీకరిస్తూ పండుగలను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. పండుగ వేళ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్నారు.
VKB: కుల్కచర్ల మండలానికి నేడు మిషన్ భగీరథ నీరు పంపిణీ లేదని అధికారులు వెల్లడించారు. నీటి పంపిణీలో సమస్య వచ్చిందని పేర్కొన్నారు. గ్రామాలలోని పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు తమ గ్రామాల బోర్ల ద్వారా ప్రజలకు నీరు అందించాలని చెప్పారు. పండగ రోజున ఏర్పడ్డ ఇబ్బందులను ప్రజలు గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని మిషన్ భగీరథ అధికారులు కోరారు.
NRPT: వేసవికాలం దృష్ట్యా మక్తల్ మండలంలోని మంథన్ గోడ్ గ్రామంలో గురువారం ఉగాది పండుగను పురస్కరించుకొని గ్రామ సర్పంచ్ కలాల్ రాజేందర్ గౌడ్ గ్రామపంచాయతీ ఆవరణలో అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు. గ్రామస్థులు, వృద్ధుల దాహాన్ని తీర్చించేందుకు ఈ సేవను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.
HYD: నగరం శ్రీరామ నవమి శోభాయాత్రకు ముస్తాబైంది. ఈ నెల 26, 27 తేదీల్లో నగరం కాషాయమయంగా మారనుంది. హౌసింగ్ బోర్డు, ధూల్‌పేట నుంచి కోటి వరకు సాగే ఈ భారీ ర్యాలీలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని అంచనా. దేశంలోనే అతిపెద్ద శోభాయాత్రగా గుర్తింపు పొందిన ఈవేడుక కోసం పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. నగర గల్లీలన్నీ జై శ్రీరామ్ నినాదాలతో దద్దరిల్లానున్నాయి.