NRPT: దామరగిద్ద మండలంలోని రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తహసీల్దార్ తిరుపతయ్య సూచించారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో ఏఈవోలు, కార్యదర్శులతో సమీక్ష నిర్వహించి, ఈ నెల 21 నుంచి 28 వరకు షెడ్యూల్ ప్రకారం రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని, దీని ప్రయోజనాలను రైతులకు వివరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సాయిలక్ష్మి, ఎంఏవో బాలాజీ పాల్గొన్నారు.
MNCL: దాడి కేసులో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు SI ప్రసాద్ తెలిపారు. నెన్నెల మండలంలోని చిత్తపూర్ గ్రామానికి చెందిన భార్యభర్తలు చెల్కల భాస్కర్, మల్లక్కపై శుక్రవారం అదే గ్రామానికి చెందిన వేముల రాజేష్, శంకరి,మల్లయ్య, సంపత్ దుర్భాషలాడి దాడి చేసి చంపుతామని బెదిరించారు. భార్యభర్తల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పేర్కొన్నారు.
MLG: వెంకటాపూర్ మండలంలోని అన్ని గ్రామాల రైతులు వెంటనే ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవాలని (AO) తెలిపారు. రైతులు ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌పుస్తకం, లింక్ మొబైల్ నెంబర్‌తో నేరుగా సంప్రదించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు. రైతు పథకాలు, సబ్సిడీలు, ఇతర ప్రయోజనాలు పొందేందుకు ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు తప్పనిసరని AO స్పష్టం చేశారు.
KMR: లింగంపేట్ మండలంలోని గాంధీనగర్లో చిరుతపులి పంజా విసిరింది. రైతు షేక్ రజాక్ పశువుల పాకలో కట్టేసిన రెండు లేగదూడలపై అర్ధరాత్రి చిరుత దాడి చేసి చంపేసింది. శుక్రవారం అటవీశాఖ అధికారులు రామకృష్ణ, వాసుదేవ్ ఘటనాస్థలిని పరిశీలించి చిరుత దాడిని ధృవీకరించారు. వెంటనే బోను ఏర్పాటు చేసి చిరుతను పట్టుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
VKB: దౌల్తాబాద్ మండల వ్యాప్తంగా భూగర్భ జలాలు పెరగడంతో రైతులు భారీగా వరి సాగు చేశారు. ప్రస్తుతం పచ్చని పొలాల్లో రైతు నేస్తాలుగా పిలువబడే కొంగలు సందడి చేస్తున్నాయి. పంటకు నష్టం కలిగించే పురుగులు, కీటకాలను ఆహారంగా తింటూ ఈ కొంగలు రైతులకు రక్షణ కవచంలా మారుతున్నాయి. ప్రకృతి ఒడిలో ఈ దృశ్యాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
JGL: బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకంలో భాగంగా, 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఉత్తమ పాఠశాలల ఎంపికకు, జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ పథకాల కింద ఎంపికైన పాఠశాలల విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఉంటాయని, మార్చి 25 లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
SDPT: హరీశ్ రావుపై కవిత పోటీకి సిద్ధమవుతుందా..? అనే చర్చ సిద్దిపేట రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. BRS నుంచి బయటకు వచ్చిన కవిత, హరీశ్ రావును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. తనను పార్టీకి దూరం చేయడంలో ఆయన పాత్ర ఉందని, సిద్దిపేటపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ‘సిద్దిపేట ఎవరి అడ్డా కాదు’ అని కవిత చేసిన వ్యాఖ్యలతో ఈ ప్రచారానికి బలం చేకూరింది.
NZB: రాష్ట్ర అభివృద్ధికి 2040 ప్రణాళికతో ముందుకెళుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో పాలన సాగిస్తున్నామన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపకుండా ఇక్కడి బీజేపీ ఎంపీలు, కేంద్రమంత్రులు సహకరించాలని కోరారు.
NLG: చందంపేట మండలం బీజేపీ నాయకులను శనివారం ఉదయం పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. AI సమ్మిట్‌లో మన దేశ పరువు పోయేలా అర్ధ నగ్నంగా కాంగ్రెస్ నాయకులు చేపట్టిన నిరసనకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర యువ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి వెళ్లనివ్వకుండా అక్రమంగా అరెస్ట్ చేశారని తెలిపారు. ఈ అరెస్ట్‌లో స్టేట్ కౌన్సిల్ మెంబర్ అంజి నాయక్ ఉన్నారు.
GDWL: నల్లమల అటవీ ప్రాంతంలో శుక్రవారం అరుదైన ‘నక్షత్రపు తాబేలు’ వెలుగుచూసింది. ఇటీవల అడవిలో అగ్నిప్రమాదాల కారణంగా వన్యప్రాణులు రోడ్లపైకి వచ్చాయి. ITDA మెడికల్ ఆఫీసర్ కళ్యాణ్ సాగర్, బ్రహ్మగిరి నుంచి అచ్చంపేట వెళ్తుండగా రోడ్డుపై భారీ తాబేలును గుర్తించారు. ఇంత పెద్ద పరిమాణంలో తాబేలును అధికారికంగా గుర్తించడం ఇదే మొదటిసారి.
పెద్దపల్లి జిల్లాలో అగ్నివీర్ నియామకాల కోసం యువతకు 90 రోజుల ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు, కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ఫిజికల్ ట్రైనింగ్, రాత పరీక్ష కోచింగ్, మెడికల్ అవగాహన, స్టడీ మెటీరియల్ సదుపాయాలు కల్పిస్తారు. 17.5-22 ఏళ్ల మధ్య, 10వ తరగతి ఉత్తీర్ణులైన పురుషులు ఫిబ్రవరి 23లోపు రుద్రమదేవి స్టేడియంలో ఉదయం 6-8 గంటల మధ్య నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.
SRD: విదేశాల్లో చదువు కోసం డా. BR.అంబేద్కర్ విదేశీ విద్యానిధి కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని SC అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి ఇవాళ తెలిపారు. విద్యార్థులు తమ దరఖాస్తులను www.telanganaepass.gov.in లో మార్చి 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. విదేశాల్లో చదువుకునేందుకు రూ.20 లక్షలు అందిస్తామన్నారు.
MBNR: జడ్చర్ల మండలం చిట్టిబోయినపల్లి ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలను అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ శుక్రవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులతో భోజనం చేసి వసతులను పరిశీలించారు. పదో తరగతి పరీక్షల మెలకువలు నేర్పించి, సందేహాలు గ్రూప్ డిస్కషన్ ద్వారా పరిష్కరించాలని సూచించారు. పరీక్షల్లో ఆత్మవిశ్వాసంతో రాయాలని విద్యార్థులను ధైర్యపరిచారు.
ADB: నేరడిగొండ మండల కేంద్రలో పోలీస్ స్టేషన్ ఎదుట NH-44పై కొత్తగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయడానికి సోలార్ బ్యాటరీలు ఏర్పాటు చేశారు. ఆకస్మాతుగా ఆ బ్యాటరీలలో మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే బ్యాటరీ మొత్తం కాలి బూడిదయింది. సమాచారం తెలుసుకున్న NH-44 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు.
KMM: కొద్దిరోజుల క్రితం తప్పిపోయిన గోపాలపురం వాసి షేక్ నాగుల్ మీరా (65) శుక్రవారం సాగర్ కాలువలో మృతి చెంది కనిపించారు. టేకులపల్లి బ్రిడ్జి సమీపంలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కాలువ నుంచి వెలికితీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.