GNTR: మంగళగిరి గౌతమబుద్ధ మెయిన్ రోడ్‌లోని అంబేద్కర్ బొమ్మ సర్కిల్ వద్ద ద్విచక్ర వాహనం, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడికి గాయాలయ్యాయి. ఘటనను గమనించిన స్థానికులు హుటాహుటిన స్పందించి, బాధితుడిని మరో ఆటోలో సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు, గాయాల తీవ్రతపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రకాశం: మార్కాపురం జిల్లా ప్లినం సమావేశం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, ప్రతినిధుల సమక్షంలో సీపీఎం జిల్లా కార్యదర్శిగా డి. సోమయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు. కొత్త బాధ్యతలు స్వీకరించిన సోమయ్యకు పార్టీ శ్రేణులు అభినందనలు తెలిపారు.
NTR: కంచికచర్ల మండలం కీసర గ్రామ దేవతలైన శ్రీ ముత్యాలమ్మ తల్లి, పోతురాజు స్వామి వార్ల దేవస్థాన ద్వితీయ వార్షికోత్సవ మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థాన ప్రాంగణంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక హోమాలు నిర్వహించారు.
ADB: హిందూ సంప్రదాయాలను భావితరాలకు తెలియజేయడమే సనాతన హిందూ ఉత్సవ సమితి లక్ష్యమని ఆ సంస్థ అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి తెలిపారు. ఆదివారం గోపాలకృష్ణ మఠంలో జరిగిన కార్యక్రమంలో పలువురు మహిళలు సమితిలో చేరారు. పట్టణంలో తమ సమితి ఒక్కటే ఉందని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. అనంతరం నూతన సభ్యులకు కాషాయ కండువాలు కప్పి ఆహ్వానించారు.
BPT: కొరిసపాడు మండలం రాచపూడిలో ఆదివారం అక్రమంగా తరలిస్తున్న గోవుల వాహనాన్ని గో పరిరక్షణ సమితి సభ్యులు అడ్డుకున్నారు. వాహనంలోని గోవులను సురక్షితంగా కిందకు దించిన సభ్యులు, అక్రమ రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గో సంరక్షణ కోసం తమ పోరాటం ఇలాగే కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. నిదితులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.
కడపలోని సప్తగిరి నగర్ శ్రీ సర్వేశ్వర మహర్షి ఆశ్రమంలో లోక కళ్యాణార్థం మహాచండీ హోమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మాధవి రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఆశ్రమ నిర్వాహకులు, స్థానిక నాయకులు,పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
CTR: పుంగనూరు పట్టణంలో టపాకాయల విక్రయాలకు అధికారిక అనుమతులు లేవని CI సుబ్బరాయుడు తెలిపారు. ఎవరైనా టపాకాయలు విక్రయిస్తున్న, అక్రమంగా నిలువ ఉంచిన వారిపై చట్ట ప్రకారం కేసు నమోదు చేస్తామని అన్నారు. ఎవరైనా క్రాకర్స్ విక్రయిస్తుంటే పోలీసులకు సమాచారం తెలియజేయాలని వారు వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
MBNR: తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక ఉపాధ్యాయులను కించపరిచేలా ఉందని వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. MBNR టీఎన్జీవో భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. త్వరలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామని ప్రకటించారు.
అమెరికాలోని సిన్సినాటిలో ఒక మ్యూజిక్ ఈవెంట్‌లో కాల్పులు జరిగాయి. రివర్ఫ్రంట్ లైవ్ వేదిక వద్ద దుండగులు జరిపిన ఈ దాడిలో 15 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
ELR: ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మార్చి 3న మూసివేస్తున్నట్లు కార్యనిర్వాహణ అధికారి భద్రాజీ ఆదివారం తెలిపారు. మార్చి 3న చంద్రగ్రహణం నేపథ్యంలో ఉదయం 6:20 గంటల నుంచి కవాట బంధనంతో ఆలయం ఉంటుందన్నారు. అదేరోజు రాత్రి 7:30 తర్వాత స్వామివారికి ఏకాంత శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. మార్చి 4 నుంచి స్వామివారు భక్తులకు దర్శనమిస్తారన్నారు.
NDL: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతుల కోసం రూ.86.68 లక్షల నిధులు విడుదల చేసి పనులు చేపట్టినట్లు రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఆదివారం అంగన్వాడీ కార్యకర్తల ఆందోళనలపై స్పందిస్తూ.. వారి సంక్షేమానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.
NRPT: సమాజంలో యువకులు చెడు అలవాట్లకు స్వస్తి చెప్పి దేశ రక్షణకు ధర్మరక్షణకు కృషి చేయాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జిల్లా ప్రచారక్ భార్గవ్ కోరారు. ఆదివారం ధన్వాడ జూనియర్ కళాశాల మైదానంలో 11 గ్రామాలకు చెందిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తల సమ్మేళనం నిర్వహించారు.దేశంలో హిందువులు మెజార్టీగా ఉంటేనే లౌకిక భావాలు కాపాడబడతాయన్నారు.
అన్నమయ్య: అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. వేతనాల పెంపుతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధి, 5G స్మార్ట్‌ఫోన్ల పంపిణీ చేపట్టినట్లు చెప్పారు. మినీ అంగన్వాడీలను పూర్తి స్థాయి కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు వెల్లడించారు. గ్రాట్యుటీ చెల్లింపుల కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించారన్నారు.
KMM: పెనుబల్లి సప్తగిరి ఫంక్షన్ హాల్‌లో ఆదివారం కరాటే ఛాంపియన్‌షిప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మట్ట రాగమయి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులకు బాల్యం నుంచి కరాటే నేర్పించడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆమె చెప్పారు. అలాగే కరాటే నేర్చుకోవడం వల్ల జరిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు.
ASR: మహిళల రక్షణకు పటిష్టమైన చట్టాలు ఉన్నాయని ముంచంగిపుట్టు ఎస్సై పీ.నాని తెలిపారు. మహిళలు తమ హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ముంచంగిపుట్టులో ర్యాలీ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలను అందరూ గౌరవించాలని, వివక్షత చూపకూడదని సూచించారు.