MNCL: మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని ఊరు రామకృష్ణాపూర్, RK-1, సుభాష్ నగర్ ఏరియాల్లో గత 15 రోజులుగా నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్రధాన పైపులైన్లు పగిలిపోవడంతో మరమ్మతు పనుల్లో జాప్యం జరుగుతోందని మున్సిపల్ కమిషనర్ రాయలింగు శనివారం ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయని, మరో వారం రోజుల పాటు నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
W.G: భీమవరం కలెక్టరేట్లో కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల వినియోగంపై కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖలకు మంజూరైన నిధులు, ఇప్పటివరకు జరిగిన ఖర్చు, పురోగతిలో ఉన్న పనుల వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. నిధులను నిర్దేశిత గడువులోగా నూరు శాతం ఖర్చు చేయాలని అధికారులను ఆదేశించారు.
PPM: గంజాయి, మాదకద్రవ్యాలు అక్రమంగా రవాణా చేయడం చట్టరీత్య నేరమని సాలూరు పట్టణ సీఐ అప్పలనాయుడు తెలిపారు. శనివారం సాలూరు ఆర్టీసీ కాంప్లెక్స్‌లో డ్రైవర్లకు, కండక్టర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. బస్సులలో అనుమానాస్పద వ్యక్తులు కనపడినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. బ్రేక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, డిపో మేనేజర్ పాల్గొన్నారు.
KDP: సిద్ధవటం మండలంలోని భాకరాపేట సమీపంలో ఉన్న APSP 11వ పోలీసు బెటాలియన్ లో 131 మంది పోలీసు సిబ్బందికి ఉచితంగా దంత వైద్య పరీక్షలు నిర్వహించినట్లు బెటాలియన్ కమాండ్మెంట్ K.ఆనంద రెడ్డి తెలిపారు. బెటాలియన్ ఆవరణలోని కళ్యాణ మండపంలో శనివారం కడప నగరానికి చెందిన హరిప్రియ డెంటల్ హాస్పిటల్ వైద్యులు దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
NZB: అక్రమంగా ఇసుకను తరలిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని బోధన్ రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ విజయ్ బాబు స్పష్టం చేశారు. శనివారం సాలూర పరివాహక ప్రాంతంలో అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ఒక టారస్ లారీని పోలీసులు పట్టుకున్నారు. ఆ వాహనాన్ని బోధన్ రూరల్ సర్కిల్ కార్యాలయానికి తరలించినట్లు సీఐ వెల్లడించారు.
KMM: విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల నుంచి కాపర్ వైర్లను దొంగిలిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను కారేపల్లి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న శ్రీకాంత్, సురేష్, యాదగిరిలపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు CI సాగర్ తెలిపారు. నిందితుల నుంచి సుమారు 100 కేజీల కాపర్ వైరు స్వాధీనం చేసుకున్నారు.
WGL: నల్లబెల్లి మండలం మేడపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ సత్య శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది హాజరు, రోగులకు అందుతున్న సేవలపై సమీక్ష నిర్వహించారు. వైద్యాధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్, సేవల్లో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. రోగులకు సమయానికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
ASF: జిల్లా రైతులకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రేపు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోతకు సిద్ధంగా ఉన్న పత్తిని రైతులు రాబోయే రెండు రోజుల్లోనే సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని అధికారులు సూచించారు. పంట నష్టం కలగకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
AP: లిక్కర్ స్కాం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వాసుదేవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయనను ఏసీబీ కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది. ఈనెల 27 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లిక్కర్ స్కాంలో వాసుదేవరెడ్డి ఏ2గా ఉన్నారు. ఈ క్రమంలో వాసుదేవరెడ్డిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.
PLD: మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే పుల్లారావు శనివారం సమీక్ష నిర్వహించారు. పట్టణాభివృద్ధి, ప్రజా సమస్యలపై దిశానిర్దేశం చేశారు. వేసవిలోపు తాగునీటి సమస్యలు పరిష్కరించాలన్నారు. ఉగాది నాటికి టిడ్కో ఇళ్ల పనులు పూర్తిచేయాలి. పారిశుధ్యం మెరుగుపరచాలి. సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం వేగవంతం చేయాలి. ఖాళీ స్థలాలపై పన్నుల వసూళ్లపై దృష్టి పెట్టాలన్నారు.
KNR: బొమ్మకల్ సమీపంలోని రాజీవ్ రహదారిపై అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఏడుగురిని విజిలెన్స్ అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో అధికారులపై దురుసుగా ప్రవర్తించిన నిందితులపై ఇన్స్‌పెక్టర్ వరుణ్ ప్రసాద్ ఫిర్యాదు మేరకు రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి కేసు నమోదు చేశారు. 7 ట్రాక్టర్లను సీజ్ చేసి, నిందితులను కోర్టులో హాజరుపరిచారు.
VZM: గోవా రాష్ట్ర గవర్నర్, మాన్సాస్ చైర్‌పర్సన్, గౌరవ పూసపాటి అశోక్ గజపతి రాజును, జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లాలో శనివారం సాయంత్రం ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఇరువురు జిల్లాకు సంబందించిన పలు అంశాలపై చర్చించారు.
VKB: దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని హరిత రిసార్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. 140 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీని స్ఫూర్తిగా తీసుకొని పార్టీ పటిష్ఠతకు పని చేయాలని సూచించారు.
SKLM: బూర్జ మండలం ఓపివాడ వెంకంపేట గ్రామంలో శనివారం టేకు చెట్లు, మామిడి తోటలు, వరికుప్పలు దగ్ధమైనట్లు గ్రామస్తులు తెలిపారు. గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసిందని గ్రామస్తులు తెలిపారు. సుమారు 50 ఎకరాల పంట నష్టం జరిగిందన్నారు. సంబంధిత రైతులను ప్రభుత్వం వారు ఆదుకోవాలని వారు కోరుతున్నారు. బాధితులు లబోదిబోమంటున్నారు.
HYD: సైబర్ నేరాలపై పోరాటంలో HYD సిటీ పోలీసులు సరికొత్త వ్యూహంతో ముందుకు వచ్చారు. ‘జాగృత్ హైదరాబాద్ – సురక్షిత్ హైదరాబాద్’ కార్యక్రమంలో భాగంగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో కలిసి షార్ట్ వీడియోల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. లాటరీ, డిజిటల్ అరెస్ట్ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ 1930 హెల్ప్ లైన్‌ను ఫిర్యాదు చేయాలని సిటీ పోలీసులు సూచిస్తున్నారు.