నెల్లూరు రూరల్ 24వ డివిజన్ కనుపర్తిపాడులో రూ.22.50 లక్షలతో ఎస్టీ కాలనీ శ్మశానానికి ప్రహరీ నిర్మిస్తున్నారు. ఈ పనులను టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చొరవతో నియోజకవర్గంలో రూ.300 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కబ్జాదారుల నుంచి కాపాడమని చెప్పారు.
అనంతపురం డీఈఐసీ కేంద్రాన్ని ప్రోగ్రాం అధికారి డా. విష్ణుమూర్తి సందర్శించి వైద్య సేవలను పర్యవేక్షించారు. జాతీయ నులి పురుగుల దినోత్సవం సందర్భంగా పిల్లలకు అల్బెండాజోల్ మాత్రలు పంపిణీ చేశారు. శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులకు డా.నాగ శశిభూషణ రెడ్డి సమక్షంలో మాత్రలు అందజేశారు. అలాగే 28 మంది చిన్నారులకు కంటి పరీక్షలు నిర్వహించారు.
కామారెడ్డిలోని బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు మానసిక సమస్యలపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు HM రమణా రెడ్డి తెలిపారు. ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా మానసిక వైద్యాధికారి డా.రమణ మాట్లాడుతూ.. విద్యార్థులు పరీక్షా కాలంలో ప్రణాళిక వేసుకొని సంసిద్ధమై, నేర్చుకున్న అంశాలను పునఃశ్చరణ చేయడం ద్వారా మానసిక సమస్యలను అధిగమించవచ్చు అన్నారు.
NZB: పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ టీం లీడర్‌గా NZB ఎంపీ అర్వింద్ మంగళవారం నియమితులయ్యారు. ఈ గ్రూప్ ద్వారా భారత్, ఉక్రెయిన్ దేశాల మధ్య పార్లమెంటరీ స్థాయిలో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం, పరస్పర సహకారాన్ని పెంపొందించడం, అలాగే విద్య, వాణిజ్యం, సాంస్కృతిక రంగాలలో సహకార అవకాశాలను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
NLG: 4వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో NLG జిల్లా పోలీస్ సిబ్బంది పలు విభాగాల్లో మెడల్స్ సాధించి ప్రతిభ చాటారు. ఈ పోటీలు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం, సైబరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ విజేతలను అభినందించి, భవిష్యత్తులో జాతీయ స్థాయిలో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు.
CTR: అరగొండ ఏ.గొల్లపల్లి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం అనారోగ్యంతో మంచానికే పరిమితమై ఉన్నందున పింఛన్ మంజూరు చేయాలని ఆయన భార్య లోకేశ్వరి కోరారు. చిత్తూరు ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. శస్త్రచికిత్స అనంతరం భర్త చేతులు, కాళ్లు పనిచేయక కుటుంబ పోషణ కష్టంగా మారిందని తెలిపారు. జిల్లా అధికారులు స్పందించి పింఛన్ మంజూరు చేయాలని ఆమె కోరారు.
TG: HYDలోని దుండిగల్ బౌరంపేటలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ కసాయి తల్లి రెండు నెలల బాలుడిని కట్టెల పొయ్యిలో వేసి చంపింది. ఆ చిన్నారి అరుపులు ఎవరికీ వినపడకూడదని నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు కట్టేసింది. ఈ ఘటనసై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ చిన్నారిని చంపడానికి గల కారణం ఏంటనేది తెలియరాలేదు.
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతోంది. 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.12.67 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ తెరకెక్కించాడు.
TG: మూసీ ప్రాజెక్టు భూసేకరణపై రాజేంద్రనగర్ RDO కీలక సమావేశం నిర్వహించారు. ‘కిస్మత్‌పురా, దర్గా ప్రాంతానికి నోటిఫికేషన్లు ఇచ్చాం. భూసేకరణ కోసం బండ్లగూడ జాగీర్, ఉప్పరపల్లిలో నిర్మాణాలు స్వాధీనం చేసుకుంటున్నాం. బఫర్‌జోన్‌లో పరిహారం ఇచ్చి మధుపార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌తో పాటు మూసీకి 50 మీ లోపున్న నివాసాలు స్వాధీనం చేసుకుంటాం’ అని వెల్లడించారు.
AP: మహిళలు, చిన్నారుల భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని హోంమంత్రి అనిత అన్నారు. ఎవరైనా ఆడపిల్లల జోలికొస్తే అదే వారికి చివరి రోజు అనే సందేశం ప్రజల్లోకి పంపామని తెలిపారు. గంజాయి సాగును పూర్తిగా అరికట్టామని చెప్పారు. డ్రగ్స్ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. గంజాయి నిర్మూలనకు ప్రత్యేకంగా ‘ఈగల్’ అనే టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
NTR: పాల కేంద్రాల్లో పాలు కల్తీ జరగకుండా, పరిశుభ్రత ప్రమాణాలు పాటిస్తున్నారా అనే అంశాలపై పశుసంవర్ధక శాఖ వైద్యుడు అభిలాష్ మంగళవారం తిరువూరులో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు కల్తీయా కాదా అని గుర్తించే విధానాలపై పాల సేకరణ కేంద్రాల నిర్వాహకులకు అవగాహన కల్పించారు. కల్తీ పాలు అమ్మితే చర్యలు తీసుకుంటామన్నారు.
జగిత్యాల జిల్లాలో నిన్న రాత్రి కురిసిన ఆకాల వర్షాలకు భారీ పంట నష్టం జరిగింది. ఈ సందర్భంగా రాయికల్ మండలం రామోజీపేట గ్రామంలో నిన్న కురిసిన వర్షానికి నష్టపోయిన పంట పొలాలను మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి మంగళవారం పరిశీలించారు. పంట నష్టంపై జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడి ప్రభుత్వానికి నివేదిక పంపించాలని కోరారు.
చెన్నై వేదికగా భారత్‌తో జరగనున్న మ్యాచ్ కోసం తాము సిద్ధంగా ఉన్నామని జింబాబ్వే కోచ్ జస్టిన్ సామన్స్ తెలిపాడు. వెస్టిండీస్ తమపై ఆడినట్లే, భారత్ కూడా ఈ మ్యాచ్‌లో దూకుడుగా ఆడుతుందని తమకు తెలుసని కోచ్ పేర్కొన్నాడు. అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పాడు. తమ పేసర్ ముజారబానీని ఎదుర్కోవడానికి భారత బ్యాటర్లు సిద్ధంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశాడు.
KRNL: ఎమ్మిగనూరులోని సంజీవయ్య నగర్ మున్సిపల్ కమిషనర్ ఎన్.గంగిరెడ్డి మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. రోడ్లు, కాలువలు, నీటి సరఫరాను పరిశీలించారు. ఆయా వార్డులలోని సమస్యలపై ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. డీఈఈ రాజు నాయక్, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, ఏఈ ప్రతాప్, సిబ్బంది ఉన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని జిల్లా అధికారి వీరేందర్ స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాలకు ఎలక్ట్రానిక్ వస్తువులు, డిజిటల్ వాచ్‌లు, సెల్‌ఫోన్లు, కెమెరాలు తీసుకురావద్దని ఆదేశించారు. పరీక్షా కేంద్రం చుట్టూ 200 మీటర్ల పరిధిలో జిరాక్స్ షాపులు తెరిచి ఉంచకూడదని సూచించారు.