KRNL: మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దేవాలయం దర్శనం నిమిత్తం కర్నూలుకు విచ్చేసిన కేంద్ర భారీ పరిశ్రమల, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి కర్నూలు ఎయిర్‌పోర్ట్ చేరుకున్నారు. కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఆయనకు ఘనంగా స్వాగతం పలికి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. అధికారులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
ATP: శ్రీవారి చిత్రపటాన్ని రాజకీయ స్వార్థానికి వాడుతూ భక్తుల మనోభావాలతో ఆడుకోవడం వైసీపీ పతనానికి నాంది అని కూటమి నేతలు మండిపడ్డారు. జనసేన జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్, ఇతర నేతలు మీడియా సమావేశంలో జగన్ తీరును తూర్పారబట్టారు. విద్వేషాలు రెచ్చగొట్టే చర్యలను చంద్రబాబు, పవన్ కల్యాణ్ స్ఫూర్తితో తిప్పికొడతామని హెచ్చరించారు.
కృష్ణా: పెనమలూరు మండలం పెదపులిపాక గ్రామంలో రూ. 4 కోట్ల 20 లక్షల నిధులతో 33/11KV విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాబోయే వేసవి కాలంలో ప్రజలకు విద్యుత్ వినియోగంలో హెచ్చు తగ్గులు లేకుండా నిరంతర సరఫరా అందించేందుకు ముందస్తు చర్యలలో భాగంగా ఈ సబ్ స్టేషన్ నిర్మాణం ప్రారంభించామని తెలిపారు.
ప్రకాశం: కనిగిరిలో రౌడీ షీటర్లు, లైంగిక నేరస్తులపై డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. చట్టాలపై అవగాహన కల్పిస్తూ నేరప్రవర్తనకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. భవిష్యత్తులో నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మంచి పౌరులుగా మారి గౌరవప్రదమైన జీవితం గడపాలని సూచిస్తూ, ఇకపై నేరాలకు పాల్పడబోమని వారితో ప్రతిజ్ఞ చేయించారు.
VZM: విజయనగరంలోని 19వ డివిజన్‌కి చెందిన 100 కుటుంబాలు వైసీపీని వీడి జనసేనలో చేరాయి. బాలాజీ నగర్ కార్యాలయంలో జనసేన నాయకుడు అవనాపు విక్రమ్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి యువత జనసేనలోకి రావడం శుభపరిణామన్నారు.
నంద్యాల: ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆదివారం మాట్లాడుతూ.. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని రాజకీయాల్లోకి లాగడం వైసీపీ చేసిన మహా తప్పిదమన్నారు. శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీల ప్రవర్తన అభ్యంతకరమని, దేవుళ్లను వాడుకుంటూ.. స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజా పాలన చేస్తున్న కూటమి ప్రభుత్వంతో వైసీపీ పతనం మొదలైందన్నారు.
సత్యసాయి: రైస్ పుల్లింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న రౌడీషీటర్ డీకే బాబును పోలీసులు అరెస్టు చేశారు. కదిరి DSP శివన్నారాయణ స్వామి ఆదివారం వివరాలు వెల్లడించారు. నిందితుడు బాధితుడి నుంచి రూ. 10 లక్షలు వసూలు చేయడమే కాకుండా, కత్తితో బెదిరించి అదనంగా నగదు, ప్రామిసరీ నోట్లు తీసుకున్నాడు. తనిఖీల్లో భాగంగా నిందితుడి నుంచి ఫార్చునర్ వాహనం స్వాధీనం చేసుకున్నారు.
E.G: ప్రజలు కోరుకున్న మంచి పాలనను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. మండపేట మండలం ఇప్పనపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు చిన్ని గంగాధరరావు తన అనుచరులు సుమారు 100 మందితో కలసి ఎమ్మెల్యే సమక్షంలో ఆదివారం వైసీపీని వీడి టీడీపీలో చేరారు.
కోనసీమ: రామచంద్రపురంలో ఆదివారం మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో 26 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు ఉపాధి ప్రాజెక్టు డైరెక్టర్ రామ్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు రామచంద్రపురం పట్టణంలో 36 జాబ్ మేళాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు మంత్రి, కూటమి సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం అభినందనలు తెలిపారు.
SKLM: బీజేపీ జిల్లా అధ్యక్షులు తేజేశ్వరరావు ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ 2026 కార్యక్రమం గాయత్రీ కాలేజ్లో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు గోపీ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బూత్ స్థాయి నుంచి బీజేపీ పార్టీ బలోపేతం చేయాలని కార్యకర్తలకు మార్గ నిర్దేశం చేశారు.
WG: జిల్లాలో రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు మొదలు కానున్నాయి. ఈ టైమ్ లో విద్యార్థులు ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని అధికారులు తెలిపారు. ఇవాళ రాత్రి తగినంత నిద్రపోయి, రేపు ఉదయం తేలికపాటి అల్పాహారం తీసుకుని పరీక్షా కేంద్రానికి ముందుగానే బయల్దేరాలని పేర్కొన్నారు. హాల్ టికెట్, పెన్నులు వంటి అవసరమైన వస్తువులను పడుకునే ముందే రెడీ చేసుకోవాలని సూచించారు.
NDL: మహానందీశ్వర స్వామి దేవస్థానంలో నిర్మించనున్న 55 గదుల వసతి సముదాయానికి ఎన్ఆర్ఐ దాత సరోజినీ వడ్లమూడి రూ.1.25 లక్షలు విరాళంగా ప్రకటించారు. మొదటి అంతస్తు నిర్మాణానికి ముందుగా రూ.65 లక్షల చెక్కును ఆలయ ఈవో నల్లకాలువ శ్రీనివాసరెడ్డికి అందజేశారు. తన తల్లిదండ్రులు వీరమాచినేని వీర రాఘవయ్య, నాగభూషణమ్మ జ్ఞాపకార్థంగా ఈ విరాళం అందజేస్తున్నట్లు తెలిపారు.
AKP: జనసేన పార్టీ బలోపేతానికి పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం రాంబిల్లి మండలం వెంకటాపురం జనసేన పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పార్టీలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారించాలన్నారు.
అన్నమయ్య: రామాపురం సుద్దమల్ల గ్రామంలోని ఓబుల్ రెడ్డిగారిపల్లె దిగువ హరిజనవాడలో నిర్మాణ దశలో ఉన్న శ్రీరామాలయ పనులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీ ఓ ట్రస్ట్ ద్వారా రూ.10 లక్షల నిధులు మంజూరు చేసినట్లు గుర్తుచేస్తూ.. నాణ్యతలో రాజీ లేకుండా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
CTR: బైరెడ్డిపల్లి మండలంలో జరిగిన కార్యక్రమంలో ఎన్. అమర్నాథ్ రెడ్డి లబ్ధిదారులకు ఈ-సైకిళ్లను పంపిణీ చేశారు. అనంతరం రూ.112.50 కోట్ల బ్యాంక్ లింకేజీ చెక్కులను అందజేశారు. మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలని, ప్రతి ఇంటికో మహిళా పారిశ్రామికవేత్తగా రాణించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయకత్వమే అవసరమని పేర్కొన్నారు.