NTR: ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో రైజ్ సెంటర్‌లో నిర్వహించిన ఏఐ ఫర్ షూర్ వర్క్ షాప్‌లో జిల్లా కలెక్టర్ లక్ష్మీశా నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆధునిక సాంకేతికత ద్వారా వ్యాపారాభివృద్ధి అవకాశాలపై అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళా పారిశ్రామిక వేత్తలను టెక్నాలజీతో శక్తివంతం చేయడమే తమ లక్ష్యమని తెలిపారు.
W.G: పాత గొడవల నేపథ్యంలో ఓ యువకుడిపై ఇద్దరు వ్యక్తులు చాకుతో దాడి చేసిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై హనుమంతు నాగరాజు తెలిపారు. ఆదివారం ఆకివీడులోని గంగానమ్మ కోడు వీధిలో బాధితుడు పవన్ కుమార్‌కు అదే ప్రాంతానికి చెందిన గోపీచంద్, వెంకటేశ్వరరావు అడ్డగించి గాయపరిచారు. తీవ్ర గాయాలైన పవన్ ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
VSP: యూత్ ఫర్ సేవ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన “చిగురు” కార్యక్రమంలో మల్కాపురం జీవీఎంసీ హై స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. అన్ని విభాగాలలో పాల్గొన్న విద్యార్థులు విజేతలుగా నిలిచి అవార్డులు సాధించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ సభ్యులు అభినందించారు.
అన్నమయ్య: సుండుపల్లి మండలం చెన్నంశెట్టి పల్లె సమీపంలోని ఎల్లమ్మ తిరుణాల సోమవారం నుంచి బుధవారం వరకు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సోమవారం అంకురార్పణ,ప్రత్యేక పూజలు,అమ్మవారి ఊరేగింపు నిర్వహిస్తామని చెప్పారు. మంగళవారం అభిషేకాలు, పుట్ట బంగారు తెచ్చుట పొంగుబాలు, రాత్రి చెక్కభజన కార్యక్రమాలు ఉంటాయన్నారు. బుధవారం చాందిని బండ్ల తిరుణాల ఉంటుందని తెలిపారు.
TPT: తిరుపతి శ్రీవారి దర్శనానికి సంబంధించి శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద ఆదివారం భక్తులకు 12 వేల సర్వ దర్శన టోకెన్లు జారీ చేశారు. వీరికి సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనం కానుంది. శ్రీవారి మెట్టు నడకదారి భక్తులకు మరో 2 వేల టోకెన్లు జారీ చేశారు.
సత్యసాయి: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను పలువురు సందర్శకులు కలిసి తమ సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ప్రజల అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించిన ఆమె సానుకూలంగా స్పందించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. వినతుల్లోని అంశాలను పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తామని చెప్పారు.
AKP: అక్రమంగా తరలిస్తున్న 20 మద్యం సీసాలను కసింకోట మండలం తాళ్లపాలెం వద్ద ఆదివారం స్వాధీనం చేసుకున్నట్లు సీఐ స్వామి నాయుడు తెలిపారు. గస్తీ నిర్వహిస్తున్న పోలీసులను చూసి కె.కాశీ విశ్వనాథం అనే వ్యక్తి పారిపోతుండగా ఎస్సై మనోజ్ కుమార్ పట్టుకున్నట్లు తెలిపారు. అతని వద్ద ఉన్న 20 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసామన్నారు.
ATP: గుంతకల్లులోని మోదినాబాద్ ఏరియాలో గల రైల్వే క్వార్టర్స్‌లో ఆదివారం అర్ధరాత్రి వరుసగా నాలుగు ఇళ్లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బీరువాలో ఉన్న నగదుతో పాటు నగలు ఎత్తుకెళ్లారు. బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పరిసర ప్రాంతాలతో పాటు సీసీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
VSP: విశాఖ నుంచి ఆగ్రాకు వెళ్తున్న మహిళ బ్యాగ్ రైల్వే స్టేషన్లో మిస్ అయింది. బ్యాగ్‌లో 200 గ్రాముల బంగారం, రూ.12,500 ఉన్నట్టు ఆమె సీపీకి ఫోన్ చేశారు. సీపీ RPF పోలీసులకు సమాచారం అందించగా సీసీ కెమెరాలను పరిశీలించి హర్యానాకు చెందిన వ్యక్తి బ్యాగును దొంగలించి ట్రైన్‌లో వెళ్లిపోయినట్టు గమనించిన RPF పోలీసులు అతడిని అరెస్టు చేసి బ్యాగు స్వాధీన పరుచుకున్నారు .
KRNL: రైతుకు గిట్టుబాటు ధర కల్పించే చర్యల్లో భాగంగా నేటి నుంచి మార్క్ ఫెడ్ ద్వారా శనగ కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు వ్యవసాయాధికారి రవి, మార్క్ ఫెడ్ నిర్వాహకులు రామకృష్ణ తెలిపారు. క్వింటాలు రూ. 5,875కు కొంటామని చెప్పారు. రైతులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.
కోనసీమ: APSSDC ఆధ్వర్యంలో అమలాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు DSDO హరి శేషు సోమవారం తెలిపారు. సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం పదో తరగతి, ఇంటర్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
NLR: బుచ్చిరెడ్డిపాలెంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థాన ఆవరణలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. ఆలయానికి వచ్చిన మహిళా భక్తురాలు వద్ద మద్యం సేవించిన వ్యక్తి రూ. 5000 అపహరించారు. దీనిని పసిగట్టిన మహిళ అక్కడే ఉన్న సిబ్బందికి తెలియజేశారు. దీంతో అతడిని సిబ్బంది పట్టుకుని అతని వద్ద ఉన్న రూ. 2,000లను తిరిగి ఇప్పించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ELR: విదేశాల్లో వైద్య పీజీ సీట్లు ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి నిలువునా ముంచిన ఘటన జంగారెడ్డిగూడెంలో వెలుగుచూసింది. పట్టణానికి చెందిన షంషీర్ అహ్మద్ కుమార్తె, మేనల్లుడికి సీట్ల కోసం మహబూబ్ నగర్‌కు చెందిన గుండా రాఘవ రూ.19.50 లక్షలు వసూలు చేశాడు. పలుదఫాలుగా నగదు తీసుకొని సీట్లు ఇప్పించకుండా పట్టించుకోకపోవడంతో బాధితుడు ఆదివారం పోలీసులను ఆశ్రయించారు.
కృష్ణా: ఉయ్యూరు రైతు బజార్లో సోమవారం అధికారులు తాజాగా కూరగాయల ధరల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో ఫ్రెంచ్‌బీన్స్, కాప్సికం కిలో రూ.62తో అత్యధికంగా నమోదు కాగా, క్యారెట్ రూ.26, టమాటా రూ.15, బీరకాయ రూ.24గా నిర్ణయించారు. పచ్చిమిర్చి రూ.45, వంకాయ రూ.20–22, దొండకాయలు రూ.32, బెండకాయ రూ.24, బంగాళాదుంప రూ.24, బీట్‌రూట్ రూ.28, ఉల్లిపాయలు రూ.23, దోస రూ.26గా ఉంది.
SKLM: జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక ‘మీ కోసం’ నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో అర్జీలు నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. ఈ వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.