KRNL: కర్నూలు డివిజన్ పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో మాధవనగర్ లోని నారాయణ ఈ టెక్నో పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇవాళ నుంచి 24వ తేదీ వరకు ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు కర్నూలు డివిజన్ తపాలా శాఖ ప్రధాన పర్యవేక్షకులు జనార్దన్ రెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ శిబిరం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందన్నారు.
WG: ఈనెల 23 సోమవారం నుంచి ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్ఎస్ఐవో జి.ప్రభాకరరావు తెలిపారు. జిల్లాలో 53 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 37,841 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో జనరల్ విభాగం నుంచి 34,150 మంది, ఒకేషనల్ నుంచి 3,691 మంది విద్యార్థులు ఉన్నారని వివరించారు.
VSP: సహకార సంఘాల ఉద్యోగులు తమ దీర్ఘకాలిక డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మె బాట పట్టారు. శుక్రవారం డీసీసీబీ బ్యాంకు నుంచి పద్మనాభం జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి, ఎన్టీఆర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. వారు పదవీ విరమణ వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు.
CTR: ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు శుక్రవారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామీణ ప్రాంత ప్రజల భద్రత, పలు అంశాలపై అవగాహన, పోలీసులు ప్రజల మధ్య స్నేహ పూర్వక సంబంధాలను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమము ఉద్దేశమన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
అన్నమయ్య: రాయచోటిలో కర్ణాటకకు చెందిన మోస్ట్ వాంటెడ్ నేరస్తుడు నసీర్‌ను సంయుక్త పోలీస్ ఆపరేషన్‌లో అరెస్ట్ చేశారు. అతనిపై 26 కేసులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ చర్యలో అన్నమయ్య ఎస్పీ ధీరజ్ చొరవకు ప్రశంసలు లభించాయి. స్థానికంగా తప్పుడు పేరుతో నివసిస్తున్నట్టు విచారణలో తేలినట్లు ఎస్పీ తెలిపారు.
TPT: తిరుపతి నగరంలో మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరా ఉండదని ఈఈసీ గంగాధరరెడ్డి తెలపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు న్యూమారుతీ నగర్, అమరావతి నగర్, ఎల్బీ నగర్, మహిళా యూనివర్సిటీ ఏరియా, ఎయిర్పోర్ట్ క్వార్టర్స్ తదితర ప్రాంతాల్లో సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
GNTR: చేబ్రోలు మండల పరిధిలో అకాల మరణం చెందిన వారి కుటుంబాలకు MLA ధూళిపాళ్ల నరేంద్ర శుక్రవారం ఎక్స్‌గ్రేషియా చెక్కులను అందజేశారు. మృతి చెందిన నలుగురు వ్యక్తుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 1.50 లక్షల చొప్పున, మొత్తం రూ. 6 లక్షల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,కార్యకర్తలు పాల్గొని బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.
TPT: తొట్టంబేడు 2 టౌన్ పరిధి చెన్నై రోడ్డులోని MGM ప్రైవేట్ ఆసుపత్రి సమీపంలో గుర్తుతెలియని వృద్ధురాలు అపస్మారక స్థితిలో ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. ఆమెను శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈమె ఆచూకీ తెలిసినవారు శ్రీకాళహస్తి టౌన్ పోలీస్ స్టేషన్‌కు సంప్రదించాలని సీఐ నాగార్జున రెడ్డి తెలిపారు.
AKP: ఎస్ రాయవరం మండలం తిమ్మాపురంలో ఈనెల 15న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు అనకాపల్లి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. నక్కపల్లి మండలానికి చెందిన కొల్లి సురేంద్ర(19) ద్విచక్ర వాహనంపై వెళుతూ స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపుతప్పి పడిపోవడంతో తీవ్రంగా గాయపడినట్లు ఎస్సై విభీషణరావు తెలిపారు.
PLD: నాగార్జునసాగర్ ప్రాంతంలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు కోసం ఏపీ ఎయిర్‌పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతినిధులు శుక్రవారం రెవెన్యూ అధికారులతో భేటీ అయ్యారు. పశువేముల, చింతలతండా,నాగులవరం గ్రామాల్లో సుమారు 800 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.భూముల వర్గీకరణ, ధరలపై తహశీల్దారుతో చర్చించి, నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు తెలిపారు.
KDP: కడప రైల్వే స్టేషన్ సమీపంలోని కేఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కళాశాల వద్ద ఘోర ప్రమాదం జరిగింది. కాచిగూడ నుంచి తిరుచానూరు వెళ్తున్న రైలులో ప్రయాణిస్తున్న బిటెక్ విద్యార్థి సైపుల్లా ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి మృతి చెందాడు. కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వెళ్లి తిరిగి కడపకు వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.
KRNL: సోలార్ విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఏపీఎస్పీడీసీఎల్ కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులు ఇక నుంచి 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదులు నమోదు చేయవచ్చని సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. నమోదైన ఫిర్యాదులను నిర్ణీత సమయంలోగా సోలార్ విక్రేతలు పరిష్కరిస్తారని అన్నారు.
కృష్ణా: పెనమలూరు పరిధిలో మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసుకు ముగింపు పలికింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నీళ్లు అడిగినట్లు నటిస్తూ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి బాలికను అసభ్యంగా తాకిన స్వామియేలు దోషిగా తేలాడు. ఈ ఘటనపై తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం కోర్టు నిందితుడికి ఐదేళ్లు శిక్ష 2000 జరిమానా విధించింది.
KDP: పులివెందుల పట్టణంలోని స్థానిక ఎస్సీ హాస్టల్ వెనుకవైపు ఉన్న కంపచెట్లలో శుక్రవారం జూద స్థావరాలపై దాడులు చేసినట్లు డీఎస్పీ మురళీ నాయక్ తెలిపారు. సిబ్బందితో దాడులు చేసి ఆరుగురిని అరెస్టు చేశామన్నారు. వీరి నుంచి రూ.40,150ల నగదుతోపాటు పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో గోపీచంద్ (29) అనే యువకుడు అదృశ్యమయ్యాడు. చాపవారి వీధికి చెందిన ఇతడు గొట్టుముక్కల రోడ్డులోని ఒక షాపులో పనిచేస్తున్నాడు. ఈ నెల 17న పనికి వెళ్లిన గోపీచంద్ తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన భార్య నిన్న రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ విశ్వనాథ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.