NDL: నేషనల్ ఇంగ్లిష్ ఒలంపియాడ్ 2025-26 పరీక్షల్లో ఆళ్లగడ్డ (M) కోట కందుకూరు ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థిని సఫియా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న ఆమె అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సర్టిఫికెట్, మొమెంటోతో పాటు లెనోవో ట్యాబ్ అందుకున్నట్లు ప్రిన్సిపల్ రాజు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా సఫియాను ఉపాధ్యాయలు ప్రత్యేకంగా అభినందించారు.
KKD: జేఎన్టీయూ నిర్వహించే ఏపీ ఈఏపీసెట్(AP-EAPSET)-2026 పరీక్షల దరఖాస్తు గడువు వివరాలను కన్వీనర్ డాక్టర్ ఎన్.మోహనరావు విడుదల చేశారు. ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 17వ తేదీ వరకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం వివిధ స్థాయిల్లో ఆలస్య రుసుములతో దరఖాస్తుకు అవకాశం కల్పించారు. ఏప్రిల్ 4 నుంచి 6 వరకు దరఖాస్తుల్లో తప్పుల సవరణకు సమయం ఉంటుందన్నారు.
W.G: భీమవరం కలెక్టరేట్ కు అందిన ఫిర్యాదు మేరకు కలెక్టర్ నాగరాణి ఆదేశాలతో స్థానిక జయశ్రీ స్వీట్స్ అండ్ బేకరీలో ఫుడ్ ఇన్ స్పెక్టర్ రామసుందరరెడ్డి సోమవారం తనిఖీలు చేపట్టారు. ఫిర్యాదుదారు సమక్షంలోనే స్వీట్ల నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపినట్లు తెలిపారు. ఆహార భద్రత ప్రమాణాలు పాటించని యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
PPM: చంద్రగ్రహణం కారణంగా మంగళవారం సీతంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రం తలుపులు మూసివేస్తున్నట్లు ఆలయ అర్చకుడు పీజీ కృష్ణమాచార్యులు తెలిపారు. ఈ మేరకు ఇవాళ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటలకు మూసివేస్తామని, తిరిగి ఆలయం శుద్ధి చేసిన తదుపరి తలుపులు తెరుస్తామని పేర్కొన్నారు. బుధవారం నుంచి యధావిధిగా దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు.
VZM: డెంకాడ మండలంలోని గొడిపాలెం నుంచి పేడాడ, బంటుపల్లి మీదుగా భోగాపురం వైపు వెళ్లే రహదారి గుంతలతో అధ్వానంగా తయారైంది. కొన్ని చోట్ల రాళ్లు తేలి ప్రమాదకరంగా మారింది. రాత్రి వేళల్లో ఈ దారిలో ప్రమాదాల బారిన పడుతున్నామని వాహన చోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించాలని వారు కోరారు.
KRNL:ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సోమవారం జరిగిన పరీక్షకు 374 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని RIO జి.లాలెప్ప తెలిపారు. జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు మొత్తం 15,847 మంది విద్యార్థులకు గాను, 15,473 మంది హాజరు కాగా.. 374 మంది గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు. పరీక్ష కేంద్రాలను సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశారు.
సత్యసాయి: పెనుకొండ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సోలార్ లైటింగ్ వ్యవస్థను మంత్రి సవిత పరిశీలించారు. రాత్రి వేళ వాకింగ్‌కు వచ్చే పాదచారుల విన్నపం మేరకు ఆమె తక్షణమే స్పందించి ఈ సదుపాయం కల్పించారు. సోమవారం రాత్రి వై జంక్షన్ వరకు ఉన్న సెంట్రల్ లైటింగ్‌ను స్కూటీ నడుపుతూ తనిఖీ చేసి ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
KDP: వల్లూరు మండలం పుష్పగిరిలో పెన్నా నదిలో గల్లంతైన శ్రీనాథ్, సాయి చైతన్య అనే ఇద్దరు యువకుల మృతదేహాలు సోమవారం లభ్యమయ్యాయి. ఆదివారం నీటిలో దిగిన వీరు సుడిగుండాల్లో చిక్కుకున్నారు. ఎస్పీ ఆదేశాలతో SI శివనాగిరెడ్డి, ఫైర్ సిబ్బంది డ్రోన్ల సాయంతో మృతదేహాలను వెలికితీసి కడప రిమ్స్‌కు తరలించారు. కొడుకుల మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
E.G: రాజమండ్రిలో కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురైన వారిలో సోమవారం రాత్రి మరొకరు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య ఆరుకు చేరింది. చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్, గాంధీ పురం ప్రాంతాలకు చెందిన 20 మంది గత నెల 16 నుంచి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇప్పటికే ఐదుగురు మరణించగా, తాజాగా మరొకరు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.
ప్రకాశం: కొమరోలు మండలంలో మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ అధికారి శ్రీనివాసులు తెలిపారు. మరమ్మత్తుల కారణంగా కొమరోలు విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, చింతలపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందన్నారు. ఈ అంతరాయానికి ప్రజలు సహకరించాలని కోరారు.
SKLM: బాణాసంచా తయారీ కేంద్రాలపై నిఘా ఉంచాలి అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. నిన్న సాయంత్రం జిల్లా అధికారులతో టెలి కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. కాకినాడలో భారీ పేలుడు ఘటనలో 21 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
అనంతపురం మార్కెట్ యార్డ్ ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి నిన్న యార్డ్ ముగిసిన వెంటనే పరిసరాలను స్వయంగా పరిశీలించారు. ఎక్కడైనా పశువులు మృతి చెందాయా అని క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. అదేవిధంగా యార్డులో పగిలిన తాగునీటి పైప్‌లైన్‌ను గుర్తించి, వెంటనే స్పందించి మరమ్మతులు చేయించారు. వినియోగదారులకు, రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.
E.G: సీతానగరంలో కొలువైన మావుళ్లమ్మ జాతర మహోత్సవానికి విశ్వహిందూ పరిషత్ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు భారీ విరాళం ప్రకటించారు. నిన్న గోకవరం CMD అవుట్లో రూ.10 లక్షల నగదును ఆలయ కమిటీ సభ్యులకు ఆయన అందజేశారు. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ జాతర సందర్భంగా అమ్మవారికి మూడు కిలోల వెండి కిరీటాన్ని చేయించేందుకు ఈ మొత్తాన్ని వెచ్చించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
AKP: కోటవురట్లలో మంగళవారం ఉదయం ఇంటి పన్నుల వసూళ్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఎంపీడీవో చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శి రఘురాం ఇంటింటికి వెళ్లి ఇంటి పన్నులు వసూళ్లు చేశారు. ఈనెల 15వ తేదీ లోగా అందరూ ఇంటి పన్నులు చెల్లించాలన్నారు. కాగా ఇప్పటివరకు మండలంలో 50% పైగా ఇంటి పన్నులు వసూళ్లు చేసినట్లు తెలిపారు.
CTR: ప్రియురాలిపై అనుమానంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కార్వేటినగరంలో జరిగింది. పద్మ సరస్సు ఎస్టీ కాలనీకి చెందిన చంద్రశేఖర్(35) ఓ మహిళతో సాన్నిహిత్యంగా ఉంటున్నాడు. ఆ మహిళపై అనుమానంతో కొందుగాని మిట్ట వద్ద ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.