ATP: రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాలకు చెందిన 50 మంది లబ్ధిదారులకు రూ. 45.85 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి మంజూరైంది. ఇందులో భాగంగా రాప్తాడు నియోజకవర్గానికి చెందిన 36 మందికి రూ. 36.60 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే పరిటాల సునీత పంపిణీ చేశారు. శనివారం రాప్తాడు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.
NDL: డోన్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ‘జీరో వేస్ట్ లిట్టర్ గవర్నెన్స్’ థీమ్‌తో స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి పాల్గొని పరిశుభ్రత పనులను పరిశీలించారు. చెత్త వర్గీకరణ, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు, పరిశుభ్రమైన వాతావరణంపై అవగాహన పెంపు అవసరమని సూచించారు.
KKD: పేద ప్రజలకు నాణ్యమైన, రుచికరమైన పౌష్టికాహారం అన్న క్యాంటీన్లలో అందజేయాలని కాకినాడ అదనపు కమిషనర్ సుధాకర్ సూచించారు. శనివారం ఆయన వివేకానంద పార్క్, రమణయ్య పేటలోని అన్న క్యాంటీన్లను తనిఖీ చేశారు. ఆహారాన్ని రుచి చూసి అక్కడ భోజనం చేస్తున్న వారితో మాట్లాడారు. భోజనం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.
GNTR: గుంటూరు నగరాన్ని వ్యర్థాల నిర్వహణలో ఆదర్శంగా నిలిపి “జీరో లిట్టర్” నగరంగా తీర్చిదిద్దుతామని గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. శనివారం ఉద్యోగ నగర్ సచివాలయంలో ఏర్పాటు చేసిన క్లస్టర్ కంపోస్ట్ యూనిట్‌ను ఆయన ప్రారంభించారు. డంపింగ్ యార్డులపై భారం తగ్గించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు
ప్రకాశం: త్వరలో విడుదల కానున్న డీఎస్సీ నోటిఫికేషన్‌లో ప్రకాశం జిల్లాకు అధిక సంఖ్యలో పోస్టులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని డీఎస్సీ అభ్యర్థులు కోరారు. శనివారం ఈ మేరకు కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. జిల్లాలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని కోరారు.
కృష్ణా: డోకిపర్రు గ్రామ పరిధిలోని జడ్పీ హైస్కూల్‌లో శనివారం విద్యార్థులకు చట్టాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. రోడ్డు భద్రత, బాల బాలికల రక్షణ, పోక్సో చట్టం, బాల్య వివాహాల నివారణ, మత్తు పదార్థాల వ్యతిరేకత, సైబర్ మోసాలపై గుడ్లవల్లేరు ఎస్సై ఎన్.వి.వి. సత్యనారాయణ వివరించారు. అత్యవసరాలకు 112, సైబర్ నేరాలకు 1930కు వెంటనే ఫిర్యాదు చేయాలని తెలిపారు.
GNTR: మేడికొండూరు మండలంలోని పేరేచర్ల భారీ గృహ లేఅవుట్‌ను కలెక్టర్ అన్సారియా శనివారం సందర్శించారు. మొత్తం 18,090 ఇళ్లలో, 9,600 అర్బన్ గృహాలు ఉన్నాయని.. ఈ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు త్వరగా ఇళ్లను అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
TPT: చెత్త రహిత, సుందర తిరుపతి నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇవాళ దండి మార్చ్ వద్ద ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫోర్ బిన్ సిస్టం ద్వారా తడి, పొడి, ప్రమాదకర వ్యర్థాలు, ఈ-వేస్ట్‌గా చెత్తను వేరు చేయాలని సూచించారు.
SKLM: అంగన్వాడీలు సమయపాలన పాటించాలని మందస సీడీపీవోపీ అరుణ అన్నారు. శనివారం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రీ స్కూల్ సిలబస్ ప్రకారం అమలు జరపాలని సూచించారు. మెనూ సక్రమంగా అమలు చేయాలని ఆదేశించారు. చిన్నారులకు ఈ కేవైసీ, ఆధార్ పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. టేక్ హోమ్ రేషన్ శత శాతం అమలు జరపాలని సూచించారు.
VSP: డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా రంగాల్లో అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్‌లో 20 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. మిలీనియం సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ సెంట్రల్ మేనేజర్ రవికుమార్ తెలిపారు. సుమారు 55 మంది అభ్యర్థులు పాల్గొనగా, సోషల్ మీడియా, గ్రాఫిక్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహింవారు.
PLD: చిలకలూరిపేట పట్టణంలోని 12వ వార్డు దాసరి కాలనీలో శనివారం నిర్వహించిన స్వచ్చాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఇందులో మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులతో కలిసి పరిసరాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాల వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
PPM: సీతానగరం పెదభోగిల పంచాయతీ సుంకరవీధిలో శనివారం డాక్టర్ ఉషారాణి ఆధ్వర్యంలో సంచార వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీపీ, షుగర్, హెమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేసారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు బీపీ, షుగర్ పరీక్షల అనంతరం ప్రతి నెల ఏ మేరకు మెరుగవుతుందో పరిశీలించారు. అనంతరం వడదెబ్బ గురించి అవగాహన కల్పించారు.
NTR: మాచవరం పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న దిలీప్ కుమారుడికి అనారోగ్యం నిమిత్తం ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు 20 లక్షలు నగదు అవసరం అయింది. విషయం తెలుసుకున్న సెంట్రల్ ఏసీపీ దామోదర్ సజ్జ కిషోర్, చారిటబుల్ ట్రస్ట్‌తో మాట్లాడి ఏడు లక్షల నగదును శనివారం ఇప్పించారు. ఈ మేరకు బాలుడికి ఆపరేషన్ చేయించనున్నట్లు సమాచారం.
PPM: గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో గల భద్రగిరి 50 పడకల ఆసుపత్రికి సీసీ రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రూ.7 లక్షల 65 వేల NREGS నిధులతో చేపట్టిన రోడ్డు పనులు చివరి దశకు వచ్చాయని ఐటీడీఏ ఏఈఈ సింగంపల్లి అప్పారావు తెలిపారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నామని వెల్లడించారు. రహదారి పనులు పూర్తయిన వెంటనే ప్రారంభిస్తామన్నారు.