»Wipro Cuts Salary Offers To Freshers Awaiting Onboarding
Wipro salary cut: రూ.6.5 లక్షలని చెప్పి సగం వేతనం తగ్గిస్తున్న విప్రో
భారత ఐటీ దిగ్గజం విప్రో (Wipro) తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. కొత్త వారికి (fresh recruiters) వార్షిక వేతనం రూ.6.5 లక్షలు ఆఫర్ చేసిన ఈ సాఫ్టువేర్ దిగ్గజం... ఆ తర్వాత దానిని దాదాపు సగానికి కోత విధించాలని నిర్ణయించుకుంది.
భారత ఐటీ దిగ్గజం విప్రో (Wipro) తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. కొత్త వారికి (fresh recruiters) వార్షిక వేతనం రూ.6.5 లక్షలు ఆఫర్ చేసిన ఈ సాఫ్టువేర్ దిగ్గజం… ఆ తర్వాత దానిని దాదాపు సగానికి కోత విధించాలని నిర్ణయించుకుంది. అంటే రూ.3.5 లక్షల ప్యాకేజీ ఇస్తామని చెబుతోంది. దీనిపై ఉద్యోగులు (Employees) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్పోరేట్, ఐటీ సంస్థలు కొన్ని ఉద్యోగాలకు అనుభవంతో పని లేకుండా ఫ్రెషర్లను తీసుకోవడం తెలిసిందే. ఇదే తరహా విప్రో కూడా ఓ నోటిఫికేషన్ ద్వారా ఫ్రెషర్ లను తీసుకున్నది. వారికి వెలాసిటీ గ్రాడ్యుయేట్స్ సెక్షన్ లో శిక్షణ ఇచ్చింది. ట్రెయినింగ్ పూర్తి చేసుకున్న ఫ్రెషర్లకు విప్రో సంవత్సరానికి రూ.6.5 లక్షల వేతన ప్యాకేజీ ఇస్తామని మొదట చెప్పింది. కానీ ఇప్పుడు సగమే ఇస్తామని చెప్పడం గమనార్హం. కంపెనీ ఆఫర్ చేసిన వేతనంలో సగానికి విధుల్లో చేరాలని ఫ్రెషర్లకు ఈ మెయిల్ ద్వారా సందేశాన్ని పంపించింది విప్రో. టెక్ కంపెనీ ఆర్థిక పరమైన కారణాల వల్ల సగం వేతనానికి చేరాలని అందులో సూచించింది. తమ ఈ నిర్ణయం కాస్ట్ కట్టింగ్, కంపెనీ తదుపరి ప్రణాళికల కోసమని చెబుతోంది.
‘మారుతున్న మ్యాక్రో ఎన్విరాన్ మెంట్, దాని ఫలితాల కారణంగా కంపెనీ వ్యాపార అవసరం నిమిత్తం ఆన్ – బోర్డింగ్ ప్లాన్స్ ను సర్దుబాటు చేయవలసి వచ్చింది. ఇప్పటి వరకు మేం ఇచ్చిన అన్ని ఆఫర్ లను గౌరవిస్తూనే వస్తున్నాం. కానీ ప్రస్తుత ఆఫర్ అభ్యర్థులకు తమ కెరీర్ ను ప్రారంభించడానికి, వారి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం కోసం తక్షణ అవకాశాన్ని కల్పిస్తుంది.’ అని విప్రో పేర్కొన్నది. దీనిపై ఐటీ ఉద్యోగుల సంఘం తీవ్రంగా స్పందించింది. అధిక వేతనం ఆఫర్ చేసి, ఇప్పుడు అందులో సగం ఇవ్వడాన్ని తప్పుబడుతోంది. ఇంతటి అన్యాయమైన నిర్ణయం ఎలా సమర్థించుకుంటారని, ఎలా సమంజసమో కంపెనీ సమీక్షించుకోవాలని స్పష్టం చేసింది. ఇది ఎవరికీ సమ్మతం కాదని స్పష్టం చేసింది. వేతనాన్ని సగం తగ్గించుకోమని కోరడం అనైతికమని ఐటీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు హర్పీత్ సింగ్ సలౌజా అన్నారు. కంపెనీ ఆర్థిక సమస్యలను ఉద్యోగులపై మోపుతారా.. అని నిలదీశారు.
అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉంది. తమ ఈ సగం శాలరీని అంగీకరించమని అభ్యర్థులను బలవంతం చేయడం లేదు విప్రో. ఫ్రెష్ రిక్రూటర్లకు నిర్దిష్ట కాల వ్యవధిని ఇచ్చింది. ప్రస్తుతం ప్రాజెక్టు ఇంజినీర్స్ రోల్స్ రిక్రూట్ మెంట్స్ అందుబాటులో ఉన్నాయని, మీ వేతనం సగానికి తగ్గకుండా.. పూర్తి వార్షిక వేతనం కోసం ఇందులో చేరవచ్చునని, అప్పుడు తాము ఇదివరకు చెప్పినట్లుగా రూ.6.5 లక్షలు ఇస్తామని తెలిపింది. ఈ నిర్ణయం అనైతికంగా కనిపిస్తున్నప్పటికీ… ఫ్రెషర్లకు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ఈ కంపెనీ ఇచ్చిన అవకాశం ఉపయోగపడుతుందనే వారు కూడా లేకపోలేదు. కాగా, ఫ్రెషర్స్ మార్చి 2023 నుండి కంపెనీలో చేరనున్నారు. వీరు రూ.6.5 లక్షలకు బదులు… రూ.3.5 లక్షల ఆఫర్ను అంగీకరించి, ఫిబ్రవరి 20వ తేదీ వరకు షార్ట్ సర్వేను ఫిల్ చేయాలని వారికి ఓ లింక్ ను పంపించింది.