Gold Bonds : పసిడి బాండ్లపై పెట్టుబడికి ఇవాళే చివరి అవకాశం
బంగారంపై పెట్టుబడి పెట్టడమంటే ముఖ్యంగా భారతీయులకు ఎంతో ఇష్టమైన విషయం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం, రిజర్వు బ్యాంకులు కలిసి సావరింగ్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ని అందుబాటులోకి తెచ్చాయి. దీనిలో సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి ఇవాళే చివరి రోజు.
sovereign gold bond scheme : బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా కేంద్రప్రభుత్వం, ఆర్బీఐలు కలిసి సావరింగ్ గోల్డ్ బాండ్లను(sovereign gold bonds) జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగో విడతగా ఫిబ్రవరి 12 నుంచి బాండ్లను విడుదల చేస్తున్నారు. ఎవరైతే వీటి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారో వారికి ఇదే చివరి అవకాశం. శుక్రవారంతో ఈ బాండ్ల జారీని నిలిపివేస్తారు. కాబట్టి ఆసక్తి ఉన్నవారు వీటిపై తొందరగా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి.
2023 – 24 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం ఇప్పటికే మూడు దఫాలుగా బాండ్లను విడుదల చేసింది. నాలుగో విడతలో ఫిబ్రవరి 12 నుంచి బాండ్ల సబ్‌స్క్రిప్షన్‌కు అవకాశం కల్పించింది. వీటి విడుదలకు చివరి తేదీ ఫిబ్రవరి 16. అంటే నేడే. ఇప్పుడు బాండ్లను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం 999 ప్యూరిటీ గల ఒక గ్రాము బంగారం ధరను రూ.6263గా నిర్ణయించింది. ఇది మార్కెట్ రేటు కంటే తక్కువే కావడం గమనార్హం.
ఈ బాండ్ల కింద కనిష్ఠంగా ఒక గ్రాము బంగారాన్ని యూనిట్‌గా భావించి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి కనీసం ఒక గ్రాము నుంచి గరిష్ఠంగా 4 కిలోల వరకు కొనుగోలు చేయవచ్చు. యూనివర్సిటీలు, ట్రస్టుల వంటివి గరిష్ఠంగా 20 కిలోల వరకు కొనొచ్చు. అలాగే ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేస్తే గ్రాముపై రూ.50 చొప్పున డిస్కౌంట్ లభిస్తుంది. 10 గ్రాములు కొన్న వారికి రూ.500 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ గోల్డ్ బాండ్ల మెచ్యూరిటీ సమయం 8 ఏళ్లుగా ఉంటుంది. వార్షికంగా 2.50 శాతం వడ్డీ ఇస్తారు. అవసరమైతే 5 ఏళ్ల పీరియడ్ తర్వాత విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.