ఇటీవల ఫోర్బ్స్ భారతదేశంలోని 100 మంది సంపన్నుల కొత్త జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం 2023 సంవత్సరంలో భారత్, ఆసియాలో అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీగా తేలింది.
Delhi : ఇటీవల ఫోర్బ్స్ భారతదేశంలోని 100 మంది సంపన్నుల కొత్త జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం 2023 సంవత్సరంలో భారత్, ఆసియాలో అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీగా తేలింది. అతడి మొత్తం సంపద 92 బిలియన్ డాలర్లు. ఆయన తర్వాత ఫోర్బ్స్ జాబితాలో గౌతమ్ అదానీ రెండో స్థానంలో ఉన్నారు. గౌతమ్ అదానీ గతేడాది భారత్, ఆసియాలో రెండవ అత్యంత సంపన్న వ్యక్తి. జనవరి 2023లో హిండెన్‌బర్గ్ నివేదిక వెలువడిన తర్వాత అతడి సంపాదన వేగంగా పడిపోయింది. భారతదేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలో రెండవ స్థానానికి పడిపోయాడు. ఇప్పుడు అతని మొత్తం ఆస్తులు 68 బిలియన్ డాలర్లు. ఈ ఇద్దరు భారతదేశంలోని అత్యంత ధనవంతులు. అయితే దేశ రాజధాని న్యూఢిల్లీకి చెందిన అత్యంత ధనవంతుడి గురించి మీకు తెలుసా?
అతని పేరు శివ్ నాడార్, అతను ఢిల్లీలో అత్యంత ధనవంతుడు.. అంతే కాకుండా భారతదేశంలో మూడవ అత్యంత ధనవంతుడు. అలాగే, అతను ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 55వ స్థానంలో ఉన్నాడు. బిలియనీర్ శివ్ నాడార్ ఆస్తుల విలువ 28.9 బిలియన్ డాలర్లు. బిలియనీర్ శివ్ నాడార్ ప్రాథమిక విద్య తమిళంలో సాగింది. 22 ఏళ్లుగా ఇంగ్లీషు కూడా సరిగారాదు. శివ్ నాడార్ PSG కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్/సైన్స్ డిగ్రీ పట్టా పొందాడు. భారతీయ ఐటీ దిగ్గజం శివ్ నాడార్ 1976లో గ్యారేజీలో ఐదుగురు స్నేహితులతో కలిసి కాలిక్యులేటర్లు, మైక్రోప్రాసెసర్లను తయారు చేసేందుకు HCLని స్థాపించారు. నేడు అతను 12.6 బిలియన్ డాలర్ల ఆదాయం కలిగిన కంపెనీని సృష్టించాడు. ప్రస్తుతం ఈ కంపెనీ భారతదేశంలోని అతిపెద్ద సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటి. జూలై 2020లో అతను హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి, ఆ పదవిని తన కుమార్తె రోష్ణి నాదర్ మల్హోత్రాకు అప్పగించారు. ఇప్పుడు అతను ఎమెరిటస్ ఛైర్మన్, సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ఫోర్బ్స్ ప్రకారం.. HCL టెక్నాలజీస్ ప్రపంచవ్యాప్తంగా 60 దేశాలలో 225,000 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంది. నాడార్ తన శివ నాడార్ ఫౌండేషన్‌కు 1.1 బిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చారు. ఈ ఫౌండేషన్ విద్య సంబంధిత సేవలను నిర్వర్తిస్తోంది.