Ambani n Adani : తొలిసారి చేతులు కలిపిన అదానీ, అంబానీ
భారత్‌లో అతి పెద్ద వ్యాపార వేత్తలుగా ఉన్న ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీలు మొదటి సారిగా చేతులు కలిపారు. కలిసి పని చేయడానికి 20 ఏళ్లకు ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Ambani n Adani Collaboration : మన దేశంలో అగ్ర వ్యాపార వేత్తలుగా చలామణీ అవుతున్న గౌతమ్ అదానీ, ముకేశ్ అంబానీలు తొలిసారి కలిసి పని చేసేందుకు ఓ ఒప్పందం చేసుకున్నారు. ఆ డీల్‌కి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అదానీ పవర్ లిమిటెడ్‌తో 500 మెగావాట్ల విద్యుత్తును తీసుకోవడానికి 20 సంవత్సరాల దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ చేసుకుంది. తద్వారా అదాని పవర్ ప్రాజెక్టు(Power project)లో 26 శాతం వాటాను కైవసం చేసుకుంది.
క్యాప్టివ్ యూజర్స్ పాలసీ ప్రకారం రెండు సంస్థలు ఈ మేరకు ఒప్పందం చేసుకున్నాయి. అదాని పవర్ లిమిటెడ్‌కు సంబంధించిన అనుబంధ సంస్థ మహాన్ ఎనర్జెన్ లిమిటెడ్‌లో 5 కోట్ల ఈక్విటీ షేర్ల కోసం రూ.50 కోట్ల పెట్టుబడిని రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్టనుంది. ఈ విషయాన్ని గురువారం రెండు సంస్థలు కలిసి స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించాయి.
గుజరాత్ రాష్ట్రానికి చెందిన గౌతమ్ అదానీ(gautam adani), ముకేశ్ అంబానీ(:Mukesh Ambani)లు వ్యాపార రంగంలో కొన్నేళ్లుగా నువ్వా నేనా అన్నట్లుగా వ్యాపారాలను విస్తరిస్తున్నారు. బిలియన్ల పెట్టుబడులు పెడుతూ పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపడుతూ ఆస్తులు పెంచుకుంటున్నారు. జామ్ నగర్లో నాలుగు గిగా ఫ్యాక్టరీలను అదానీ నిర్మిస్తున్నారు. అదే క్రమంలో అంబానీ సైతం మూడు గిగా ఫ్యాక్టరీలను నిర్మిస్తున్నారు. ఈ మధ్య జరిగిన అనంత్ అంబానీ పెళ్లి వేడుకలకు హాజరైన అదానీ అతి కొద్ది రోజుల్లోనే ఈ ఒప్పందం చేసుకున్నారు.