ఆర్బీఐ విధించిన ఆంక్షలతో పీటీఎం మాతృసంస్థ వన్-97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ షేర్ల విలువ అట్టడుగు స్థాయికి క్షీణించింది. కేవలం నాలుగురోజుల్లో 45 శాతం పడిపోయింది.
Paytm: పేటీఎం(Paytm) పేమెంట్స్ బ్యాంక్ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో పేటీఎం మాతృసంస్థ వన్-97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ షేర్ల విలువ దారుణంగా పతనమైంది. నాలుగు రోజుల్లో 45 శాతం పడిపోయింది. ఈ ఒక్క రోజే షేర్ల విలువ 10 శాతం క్షీణించింది. ఆర్బీఐ నిర్ణయంతో మూడు రోజుల వ్యవధిలోనే పేటీఎం మార్కెట్ విలువ రూ.20,471 కోట్ల మేర పతనమైంది. ఐదు రోజుల కిందట పేటీఎం షేరు విలువ రూ.760.65 ఉండగా, ఇవాళ అది రూ.438.50కి పడిపోయింది.
యూజర్ల నుంచి ఫిబ్రవరి 29 తర్వాత డిపాజిట్లు స్వీకరించరాదని పేటీఎంపై ఆర్బీఐ(RBI) ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూజర్ల అకౌంట్లు, వ్యాలెట్‌లో మనీ, ఎన్సీఎంసీ కార్డులు, ఫాస్టాగ్‌లో మనీ, క్రెడిట్ ట్రాన్సాక్షన్లు, టాప్ అప్లు లాంటి వాటికి పేటీఎంను వినియోగించవద్దని ఆర్బీఐ ఆదేశించింది. పేటీఎం సంస్థ ఆర్బిఐ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు, కస్టమర్ల కేవైసీని ఉపయోగించి ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయడం, దాని ద్వారా మనీ ల్యాండరింగ్‌కు పాలుపడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతే కాకుండా పేటీఎంలో చైనాకు సంబంధించిన ఓ కంపెనీ షేర్స్ కూడా ఉన్నట్లు, ఇండియన్ కస్టమర్ల డేటా కూడా దొంగలించబడుతుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే సంస్థలో పర్యవేక్షణ లోపాలు ఉన్నట్టు ఆడిటింగ్‌లో తేలిందని ఆర్బీఐ ఈ కఠిన చర్యలు తీసుకుంది.