ఇప్పుడు అంతా డిజిటల్ ట్రాన్సాక్షన్స్.. పెద్ద నోట్లు రద్దు తర్వాత దేశంలో డిజిటల్ చెల్లింపులు భారీగా పెరిగాయి. యూపీఐ ద్వారా టీ స్టాల్, టిఫిన్ సెంటర్, చికెన్ సెంటర్.. ఒక్కటేమిటి అన్నీ చోట్ల స్కాన్ చేసి చెల్లింపులు చేస్తున్నారు. డిజిటల్ చెల్లింపుల్లో ఫోన్ పేను ఎక్కువ ఉపయోగిస్తున్నారు. తన సేవలను ఫోన్ పే మరింత విస్తరించింది. విదేశాల్లో కూడా అందుబాటులోకి తీసుకొంది. యూఏఈ, సింగపూర్, మారిషస్, నేపాల్, భూటాన్ దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. దీంతో అక్కడ ఉండే భారతీయులకు మేలు జరగనుంది.
అంతర్జాతీయంగా యూపీఐ సేవలను తీసుకొచ్చిన తొలి ఫిన్టెక్ సంస్థగా ఫోన్ పే అవతరించింది. భారతీయులు ఆయా దేశాలకు వెళ్లిన సమయంలో నగదు మార్పిడి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. భారతీయ బ్యాంకు ఖాతా ద్వారా నేరుగా నగదు చెల్లింపులు చేసుకోవచ్చు. విదేశాల్లో యూపీఐ చెల్లింపుల కోసం అనువైన సాంకేతికతను ఏప్రిల్ 30 లోపు సిద్ధం చేసుకోవాలని భారత జాతీయ చెల్లింపుల కార్పొరేషన్ గత నెలలో ఫిన్టెక్ సంస్థలకు సూచించింది. దీంతో ఫోన్ పే ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
భారతీయులు విదేశాలకు వెళ్లిన సమయంలో అక్కడి వ్యాపారులకు యూపీఐ ద్వారా పేమెంట్స్ చేస్తే విదేశీ కరెన్సీ వారి బ్యాంకు ఖాతా నుంచి డెబిట్ అవుతుంది. విదేశాల్లో ప్రయాణించే భారతీయులు అక్కడ చెల్లింపులు చేసే సమయంలో ఈ సేవలు ఉపయోగపడతాయి. దీంతో నగదు మార్పిడి భారం తప్పుతుంది. సులభంగా లావాదేవీలు జరుగుతాయి. త్వరలో మరిన్ని దేశాలకు సేవలను విస్తరిస్తామని ఫోన్ పే సహ వ్యవస్థాపకుడు రాహుల్ చారి తెలిపారు. ఫోన్ పే దేశానికి చెందిన డిజిటల్ చెల్లింపుల యాప్.. క్రమంగా విదేశాలకు కూడా విస్తరిస్తోంది.