అదానీ గ్రూప్ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అప్పులకుప్పలా మారిన గ్రూప్ కంపెనీల ఆర్థిక సత్తాపై అమెరికాకు చెందిన హిడెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లోను మోసం చేస్తోందని ఆ అమెరికా సంస్థ ఆరోపించింది. అదానీ ఎంటర్ ప్రైజేస్ త్వరలో రూ.20,000 కోట్ల మలిదశ ఐపీవో జరగనున్న నేపథ్యంలో ఈ ఆరోపణలు గమనార్హం. ఈ రీసెర్చ్ నేపథ్యంలో బుధవారం అదానీ గ్రూప్ షేర్లు భారీగా నష్టపోయాయి.
ఈ ఆరోపణలపై అదానీ గ్రూప్ కూడా స్పందించింది. ఈ ఆరోపణలకు ఆధారాలు లేవని పేర్కొంది. కేవలం ద్వేషంతో ఏకపక్షంగా హిడెన్ బర్గ్ సంస్థ ఈ ఆరోపణలు చేసినట్లు పేర్కొన్నది. మా గ్రూప్ కంపెనీల షేర్ల విక్రయాలకు నష్టం చేయాలన్న దురుద్దేశంతో ఈ నివేదిక వండివార్చినట్లు తెలిపింది. తమను సంప్రదించకుండా, నిజానిజాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేశారన్నది. ఈ ఆరోపణలు ఇప్పటికే కోర్టుల్లో వీగిపోయాయని గుర్తు చేశారు. హిడెన్ బర్గ్ పై అదానీ చర్యలకు ఉపక్రమిస్తోందని సమాచారం.