తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు సమయం ఆసన్నమైంది. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 3వ తేదీన మధ్యాహ్నం 12.10 గంటలకు శాసనసభ సమావేశాలు మొదలు కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ, మండలి సమావేశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారం అందించారు. శాసనసభ ప్రారంభం రోజే బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2023-24 ప్రతిపాదనలపై శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, ఉన్నత అధికారులతో సీఎం సమీక్షించారు. ప్రవేశపెట్టబోయే బడ్జెట్ దాదాపు రూ.2.85 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు ఉండవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం.
గవర్నర్ ప్రసంగం లేనట్టే..?
అయితే బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి గవర్నర్ ప్రసంగం ఉండాలి. కానీ గవర్నర్ తో పేచీ ఉండడం కారణంగా బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని నెలల నుంచి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య విబేధాలు తారస్థాయికి చేరాయి. అత్యవసరమైన పరిస్థితిలో మినహా సీఎం కేసీఆర్ గవర్నర్ ను కలవడం లేదు. ఇటీవల ఖమ్మం సభలో చేసిన వ్యాఖ్యలపై గవర్నర్ తమిళిసై ఘాటుగా స్పందించారు. దీంతో బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ లేకుండా నిర్వహించాలనే పట్టుదలతో సీఎం కేసీఆర్ ఉన్నారు. దేశంలో గవర్నర్ల వ్యవస్థపై వివాదం కొనసాగుతుండడంతో ఈసారి తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుంటే మాత్రం వివాదం మరింత పెరిగే అవకాశం ఉంది.