ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటుచేసుకుంది. దర్శి వద్ద సాగర్ కెనాల్లో పెళ్లి బస్సు(Bus) బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. మృతిచెందిన వారిలో ఐదుగురు మహిళలు, ఓ చిన్నారి, ఓ యువకుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మరో 30 మందికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
పొదిలి నుంచి కాకినాడకు వివాహ రిసెప్షన్ కోసం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని, డ్రైవర్ నిద్ర మత్తు కారణంగానే బస్సు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారని, వారంతా పెళ్లి రిసెప్షన్ కు హాజరై వస్తున్నట్లు తెలిపారు. బోల్తా పడిన బస్సును క్రేస్ సాయంతో వెలికితీశారు.
మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉండగా, బస్సు కింద నీళ్లలో చిక్కుకున్న ఆరేళ్ల పాప షేక్ హీనా మృతదేహాన్ని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో పెళ్లికూతురి మేనత్తలు ఇద్దరు, అమ్మమ్మ, మేనత్త కోడలు ఉన్నట్టు సమాచారం. పొదిలి పెద్ద మసీదు హాఫీజ్ సాబ్ అబ్దుల్ అజీజ్, ఆయన భార్య, మనవరాలు మృతిచెందిన వారిలో ఉన్నారు.