»Trying To Raise The House By Putting Jockeys Fail The Plan Hyderabad
House: ఇల్లు కిందికి ఉందని జాకీలు పెట్టి పైకి లేపాలని ప్రయత్నం..బెడిసికొట్టిన ప్లాన్
హైదరాబాద్(hyderabad) కుత్బుల్లాపూర్ సర్కిల్ ప్రాంతంలో తన ఇల్లు రోడ్డు కంటే కిందకి ఉందని ఓ ఇంజనీర్ సహాయంతో హైడ్రాలిక్ జాకీలతో భవనాన్ని పైకి లేపే ప్రయత్నం చేశారు. కానీ అది బెడిసికొట్టింది. ప్రమాదశాత్తు ఎవరికీ ఏమి కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
జాకీలతో ఇంటి(house)ఎత్తు పెంచే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్లాన్ వర్క్ అవుట్ కాలేదు. పైగా భవనం కొంత భాగం కూలడంతోపాటు పక్కకు ఒరిగింది. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని శ్రీనివాసనగర్ కాలనీకి చెందిన నర్సింహారావు 25 ఏళ్ల క్రితం జీ ప్లస్ 2 విధానంలో ఇల్లు నిర్మించుకున్నారు. ప్రస్తుతం అక్కడ రోడ్డు ఎత్తు పెరగడంతో వర్షం కురిసిన ప్రతిసారీ వరద నీరు ఇళ్లలోకి చేరుతోంది. ఆ క్రమంలో తెలిసిన వారి సూచనలతో ఇంటి ఎత్తు పెంచేందుకు చర్యలు చేపట్టారు. విజయవాడకు చెందిన ఓ గుత్తేదారుకు పని అప్పగించాడు. ఈ భవనంలో మొత్తం యజమానితో సహా ఆరు కుటుంబాలు ఉన్నాయి. మరమ్మతు ప్రక్రియ ప్రారంభమైన తర్వాత, రెండు కుటుంబాలను ఖాళీ చేయించారు. మరో రెండు కుటుంబాలు సమీపంలోని వారి పరిచయస్తుల ఇళ్లకు మారారు. యజమాని కుటుంబంతో పాటు ఇతర కుటుంబాలు అక్కడే ఉంటున్నాయి.
ఆ క్రమంలో ఇంటి ఎత్తు పెంచేందుకు వినియోగించే హైడ్రాలిక్ జాకీలు(jockeys) ఉపయోగించగా శనివారం రాత్రి అదుపు తప్పి పక్కనే ఉన్న మరో భవనంపై ఒక్కసారిగా ఒరిగింది. దీంతో సమాచారం అందుకున్న గెడిమెట్ల సీఐ పవన్, బల్దియా టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని బందోబస్తు చేపట్టారు. అనుమతులు లేకుండా మరమ్మతులు చేసినందుకు గాను ఇంటి యజమానిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఒకవైపు వాలుతున్న భవనాన్ని కూల్చివేయాలని నిర్ణయించామని వెల్లడించారు. అయితే శనివారం రాత్రి కురిసిన వర్షం కారణంగా కూల్చివేత పనులను ఆదివారానికి వాయిదా వేసినట్లు బల్దియా అధికారులు తెలిపారు.