పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మృతి చెందిన విషయం తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన యూఏఈలోని హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్ను మూశారు. పాకిస్థాన్‌కు పదో అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన మృతి నేపథ్యంలో కాంగ్రెస్ నేత శశిథరూర్ స్పందిస్తూ.. ప్రశంశలు కురిపించారు. ముషారఫ్ ను ప్రశంసించిన కాంగ్ ఎంపీ శశి థరూర్ పై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ముషారఫ్ మృతిపై శశిథరూర్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ… పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ అరుదైన వ్యాధితో మరణించారని తెలిపారు. ఆయన ఒకప్పుడు భారత దేశానికి రాజీలేని శత్రువు అన్నారు. అయితే 2002-2007 మధ్య కాలంలో నిజమైన శాంతికాముకుడిగా మారారన్నారు. ఆ రోజుల్లో తాను ఐక్య రాజ్య సమితిలో ఆయనను ప్రతి సంవత్సరం కలిసేవాడినని గుర్తు చేసుకున్నారు. ఆయన చాలా తెలివైనవారని, కలుపుగోలుగా ఉంటారని, వ్యూహాత్మక ఆలోచనలో చాలా స్పష్టంగా ఉంటారని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. దీంతో బిజెపి మండిపడింది. ముషారఫ్ కార్గిల్ యుద్ధానికి కారకుడయ్యారని, అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌ను కొనియాడారని గుర్తు చేసింది.