»Teacher Ramesh Arrested For Cheating Rs 9 5 Crore In The Name Of Food Products
Cheating: ఫుడ్ ప్రొడక్ట్స్ పేరుతో రూ.9.5 కోట్లు చీటింగ్..టీచర్ అరెస్ట్
ఈజీ మనీ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే పలువురు కేటుగాళ్లు అనేక రకాల మాయమాటలు చెప్పి దోచుకున్న సందర్భాలు గతంలో అనేకం చుశాం. ఇప్పుడు తాజాగా మరో ప్రబుద్ధుడు అలాంటి ఘటనలోనే దొరికిపోయాడు. ఇతను ఏకంగా టీచర్ కావడం విశేషం. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.9.5 కోట్లు పలువురి నుంచి లూటీ చేశాడు.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో(telugu states) ప్రజలను ఈజీ మనీ పేరుతో మోసం చేసిన మరో కేటుగాడు అరెస్టయ్యాడు. అయితే మంచి, చెడు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే ఈ స్కాంకు పాల్పడటం విశేషం. ఫేస్బుక్ ఖాతా ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలను మోసం చేసిన ఈ ఉపాధ్యాయుడు దాదాపు రూ.9.5 కోట్లు దోచుకున్నాడు. ఈ నేపథ్యంలో అతన్ని అరెస్టు చేసిన సిరిసిల్ల పోలీసులు అతని బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు. నిందితుడిని ఆదివారం పోలీసు సూపరింటెండెంట్ అఖిల్ మహాజన్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని మల్లాపూర్‌కు చెందిన కట్టుకోజుల రమేశ్‌చారి గతంలో ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పనిచేసి ఆ తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ చేసేవాడు.
ఆ క్రమంలో సులువైన మార్గంలో డబ్బు ఎలా సంపాదించాలని ఆలోచించాడు. ఆ నేపథ్యంలోనే ఎలక్ట్రానిక్ వస్తువులు, బంగారాన్ని మార్కెట్లో ఉన్న ధరలో 30 నుంచి 40 శాతం తక్కువకు అందజేస్తామని చెప్పి మోసం చేయడం ప్రారంభించాడు. రమేష్ చారి(ramesh chari) పేరుతో ఫేస్బుక్ ఐడీని క్రియేట్ చేసి దానికి తన మొబైల్ నంబర్లు కూడా 8332924133, 8790097813 లింక్ చేశాడు. అయితే ఆఫర్లు వచ్చినప్పుడల్లా అతను ఇ-కామర్స్ వ్యాపార సైట్లైన ఫ్లిప్‌కార్ట్ ష అమెజాన్‌లో వివిధ ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసి, ఆపై వాటిని ఫేస్బుక్ ఖాతా ద్వారా మార్కెట్ చేసేవాడు. ప్రజలు అతనిని సంప్రదించగా, అతను ముందుగా వారి నుంచి డబ్బు వసూలు చేసేవాడు. కానీ వారికి మాత్రం సరుకులు పంపేవాడు కాదు. ఆ నేపథ్యంలో అక్కడి నుంచి మాకాం మార్చి హైదరాబాద్ వచ్చేశాడు.
అతను ‘మన తెలంగాణ ఫుడ్స్ & ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్స్’ పేరుతో ఒక సంస్థను రిజిస్టర్ చేసి హైదరాబాద్(hyderabad)లోని ప్రగతినగర్‌లో కార్యాలయాన్ని కూడా ప్రారంభించాడు. 14 నెలలుగా వ్యాపారాన్ని కొనసాగిస్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలువురి నుంచి దాదాపు రూ.9.5 కోట్లు వసూలు చేశాడు. రాజన్న-సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లో 19 కేసుల్లో ఇతని ప్రమేయం ఉంది. మరోవైపు గతంలో పలువురికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన కేసు కూడా ఇతనిపై ఉంది. ఈ నేపథ్యంలో అతని నాలుగు బ్యాంకు ఖాతాలను పోలీసులు సీజ్ చేశారు.