సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి మెరుగైందని సినీ నిర్మాత లక్ష్మీపతి, నిర్మాతల సంఘం సెక్రటరీ తుమ్మల ప్రసన్న కుమార్ ప్రకటించారు. తారకరత్నతో గతంలో ఒక సినిమాను పూర్తి చేశామని.. అతడు కోలుకోగాలనే మరో సినిమా చేస్తామని ప్రకటించారు. గుండెపోటుకు గురైన తారకరత్న ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రి చికిత్స పొందుతున్నాడు. ఆస్పత్రిలో అతడిని పరామర్శించిన అనంతరం లక్ష్మీపతి, ప్రసన్న కుమార్ మీడియాతో మాట్లాడారు. తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతోందని, ఆయన కాళ్లు, చేతులు కదుపుతున్నారని తెలిపారు.
‘తారకరత్న వంద శాతం ఆరోగ్యవంతుడు అవుతాడు. ప్రజలందరూ తారకరత్న కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. జనవరి 23వ తేదీ నుంచి ఆయనతో రెండో సినిమా తీయడానికి మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేశాం. కానీ యువగళం పాదయాత్ర కారణంగా ఆయన ఫిబ్రవరి 6 తరువాత చిత్ర నిర్మాణం ప్రారంభించాలని తారకరత్న చెప్పాడు. ‘బి అలర్ట్’ అనే పేరుతో సినిమాను నిర్మించాల్సి ఉండగా.. ఇంతలోనే తారకరత్న అనారోగ్యానికి గురి కావడం చాలా బాధాకరం. ఆయన త్వరగా కోలుకుంటారని.. త్వరలోనే సినిమాను కూడా పూర్తి చేస్తాం’ అని తెలిపారు.