ఫిఫా మహిళల ఫుట్ బాల్ వరల్డ్ కప్ (FIFA Women’s World Cup 2023)లో స్పెయిన్ (Spain) విజేతగా నిలిచింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో నేడు జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ జట్టు ఒక్క గోల్‌తో ఇంగ్లండ్‌ను ఓడించి విజయం సాధించింది. మ్యాచ్ ముగిసే సమయానికి స్పెయిన్ జట్టు 1-0తో ఆధిక్యంలో ఉంది. ఆ ఒక్క గోల్ కూడా స్పెయిన్ కెప్టెన్ ఓల్గా కార్మోనా సాధించడం విశేషం. స్పెయిన్ స్కోరును సమం చేసేందుకు ఇంగ్లండ్ అమ్మాయిలు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది.
స్పెయిన్ గోల్ పోస్టుపై పదే పదే దాడులు చేసినా ఇంగ్లండ్ ప్రయత్నాలు నెరవేరలేదు. సెకండాఫ్ లో అటు స్పెయిన్ ఇటు ఇంగ్లండ్ జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలోనే స్పెయిన్ (Spain)కు ఇది తొలి టైటిల్ కావడం విశేషం. ఇప్పటి వరకూ చూస్తే ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధికంగా అమెరికా జట్టు 4 సార్లు విజయం సాధించింది.
ఈ ఏడాది ఫిఫా మహిళల వరల్డ్ కప్ (FIFA Women’s World Cup 2023) టోర్నీకి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చాయి. టోర్నీలో మొత్తంగా 32 జట్లు పాల్గొనగా అందులో స్వీడన్, ఆస్ట్రేలియా జట్లు సెమీస్ లోనే ఇంటిముఖం పట్టాయి. విజేతగా నిలిచిన స్పెయిన్ మహిళల జట్టుకు రూ.35 కోట్ల ప్రైజ్ మనీ లభించగా రన్నరప్ గా నిలిచిన ఇంగ్లండ్ జట్టుకు రూ.25 కోట్ల ప్రైజ్ మనీ అందనుంది.