»Rain In Hyderabad Rains In The State For The Next 3 Days
Hyderabad:లో వర్షం..రాష్ట్రంలో వచ్చే 3 రోజులు కూడా వానలు!
భాగ్యనగరంలో గత కొన్ని రోజులుగా ఎండవేడికి తాళలేకపోయిన ప్రజలకు ఊరట లభించింది. పలు చోట్ల చిరుజల్లులు కురవడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు రానున్న మూడు రోజులు కూడా రాష్ట్రంలో వానలు కురియనున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.
హైదరాబాద్‌లో ఈరోజు సాయంత్రం పలు చోట్ల వాన కురిసింది. ఈ రుతుపవనాల తొలి జల్లులు ప్రజలకు ఉపశమనం కలిగించాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతోపాటు వచ్చే మూడు రోజులు కూడా రాష్ట్రంలో వర్షం కురిస్తుందని వెదర్ రిపోర్ట్ తెలిపింది. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 37-38 డిగ్రీల సెల్సియస్ నుంచి 26-27 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి.
ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్ బాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, యాదాద్రి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ వర్షాలు శుక్రవారం వరకు పలు చోట్ల కురుస్తాయని అధికారులు తెలిపారు.