కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేటితో ముగియనుంది. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ లో ఆయన పాదయాత్ర చేస్తున్నారు. శ్రీనగర్ లాల్ చౌక్ వద్ద ఆయన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. రేపు శ్రీనగర్ లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు 21 ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వానం పంపారు. 2022 సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో భారత్ జోడో యాత్రను రాహుల్ ప్రారంభించారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ నుంచి జమ్మూకశ్మీర్ లోకి ఈ యాత్ర ప్రవేశించింది.
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు దాదాపు 3,570కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ తన పాదయాత్రను కొనసాగించారు. కాంగ్రెస్ శ్రేణులతో పాటు వివిధ వర్గాలు రాహుల్ వెంట నడిచి తమ మద్దతు తెలిపారు. సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీ, రాబర్ట్ వాద్రాతో పాటు పలువురు కాంగ్రెస్ అగ్ర నేతలు జోడోయాత్రలో రాహుల్ వెంటన నడిచారు. దాదాపు 145 రోజుల పాటు సాగిన పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలతో రాహుల్ గాంధీ మమేకమయ్యారు. తాము అధికారంలోకి వస్తే ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కూడా ఆయన భరోసా ఇచ్చారు.