Water Metro: వాటర్ మెట్రోని ప్రారంభించిన ప్రధాని మోదీ
దేశంలో తొలిసారి వాటర్ మెట్రోని మోదీ(Narendra Modi) ప్రారంభించారు. కేరళ రాష్ట్రంలో ఈ మెట్రోని తీసుకువచ్చారు. ఇప్పుడు ఈ మెట్రో ప్రజలందరినీ ఆకర్షిస్తోంది.
దేశంలోనే తొలి వాటర్ మెట్రోను ప్రధాని మోదీ(Narendra Modi) ప్రారంభించారు. కేరళ(kerala) పర్యటనలో ఉన్న ఆయన కొచ్చిలో ఈ వాటర్ మెట్రోను మంగళవారం లాంచ్ చేశారు. అంతకుముందు.. కేరళలో తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను సైతం ప్రారంభించారు. ఇక కోచ్చిలో తొలి వాటర్ మెట్రోను ప్రారంభించడమే గాక డిజిటల్ యూనివర్సిటీని ఆయన లాంచ్ చేశారు. ముఖ్యంగా దేశంలో ఇలాంటి ప్రాజెక్టును చేపట్టడం ఇదే మొదటిసారి.
ఈ ప్రాజెక్టుతో ఈ నగరం చుట్టూ ఉన్న 10 చిన్న దీవులకు ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులోకి రానుంది. కోచ్చి షిప్ యార్డు లిమిటెడ్ తయారు చేసిన 8 ఎలెక్ట్రిక్ హైబ్రిడ్ బోట్లను మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ప్రముఖ జర్మన్ కంపెనీ కెఎఫ్ డబ్ల్యు సంస్థ, కేరళ ప్రభుత్వం రూ. 1137 కోట్లతో ఈ వాటర్ మెట్రో ప్రాజెక్టును సంయుక్తంగా చేబట్టాయి.
జల రవాణా రంగంలో ఈ వాటర్ మెట్రో ప్రాజెక్టు గణనీయమైన మార్పులు తెస్తుందని సీఎం పినరయి విజయన్ తెలిపారు. కోచ్చి షిప్ యార్డ్ నుంచి మొత్తం 15 రూట్లలో 75 కి.మీ. దూరం మేర అత్యాధునిక ఎలెక్ట్రిక్ బోట్లను నడపనున్నట్టు మెట్రో ఎండీ లోక్ నాథ్ బెహ్రా వెల్లడించారు. సింగిల్ ట్రిప్ టికెట్లతో బాటు వీక్లీ, నెలవారీ, త్రైమాసిక పాస్ లు అందుబాటులో ఉంటాయని, ఫలితంగా టూరిజం రంగం ఎంతగానో అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు.
ఈ నగరం చుట్టూ ఎన్నో దీవులు ఉన్నాయని, వాటిలో పది దీవులు ముఖ్యమైనవని ఆయన పేర్కొన్నారు. కేవలం కోచ్చి వన్ కార్డును వినియోగించి ఒక వ్యక్తి మెట్రో రైల్లోను, ఈ వాటర్ మెట్రోలోనూ ప్రయాణించవచ్చునన్నారు. కేరళకు మోడీ ఈ విశిష్టమైన ‘వరాన్ని’ ప్రకటించడం పట్ల ఆయన హర్షం చేశారు.