మునుగోడు ఉప ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు చాలా సీరియస్ గా తీసుకున్నాయి. అన్ని పార్టీలు తమదే గెలుపు కావాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కాగా.. తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించారు.
మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. దివంగత సీనియర్ కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్థన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి ని తమ అభ్యర్థిగా ప్రకటించారు.
మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతికి అవకాశమిస్తున్నట్లు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ముఖుల్ వాస్నిక్ తెలిపారు. అంతకుముందు టీపీసీసీ నలుగురు అభ్యర్థుల జాబితాను ఢిల్లీకి పంపించింది. అందులో పాల్వాయి స్రవంతి, కృష్ణారెడ్డి, కైలాష్ నేత, పల్లె రవి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది.
వీరిలో కాంగ్రెస్ అధిష్టానం పాల్వాయి స్రవంతి వైపే మొగ్గుచూపింది. మునుగోడు నియోజకవర్గంలో మంచి పేరు ప్రతిష్టలు ఉండటం కూడా ఆమెకు కలిసొచ్చింది. మునుగోడు కాంగ్రెస్ టిక్కెట్ కోసం స్రవంతి, కృష్ణారెడ్డి మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. టిక్కెట్ తమకే దక్కుతుందని ఇరువురు నేతలు ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. అభ్యర్థి ఎంపిక కోసం ఏఐసీసీ ఓ కమిటీని కూడా నియమించింది. పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తల అభిప్రాయాలు సేకరించిన పెద్దలు చివరికి పాల్వాయి స్రవంతికే అవకాశమిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేసిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తెగా స్రవంతి మునుగోడు ప్రజలకు సుపరిచితురాలు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మునుగోడు అభ్యర్థిగా పోటీ చేసిన స్రవంతి ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు టికెట్ ఆశించడంతో స్రవంతి స్వచ్ఛందంగానే పోటీ నుంచి తప్పుకుని ఆయన గెలుపు కోసం పనిచేశారు. ఆ విధేయతే పాల్వాయి స్రవంతికి కలిసివచ్చినట్లు సమాచారం.