గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పౌర పురస్కరాలైన పద్మ అవార్డులను బుధవారం ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన, అందిస్తున్న ప్రముఖులను కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలను ప్రకటిస్తుంది. కళలు, సాహితీ, విద్య, వైద్యం, సామాజిక సేవ, వాణిజ్యం, వ్యాపారం తదితర విభాగాల్లో కేంద్రం అవార్డులు అందిస్తుంది.ఈ ఏడాది కూడా వివిధ రంగాల ప్రముఖులకు కేంద్రం అవార్డులను ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాల నుంచి పలువురికి అవార్డులు దక్కాయి. తెలంగాణ నుంచి ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామికి పద్మభూషణ్, బి.రామకృష్ణారెడ్డి సాహితీ సేవలో పద్మశ్రీ లభించింది. దక్షిణాది భాషలకు విశేష సేవలందించడంతో రామకృష్ణారెడ్డికి కేంద్రం అవార్డు ప్రకటించింది. ఇక ఏపీ నుంచి సామాజిక సేవల విభాగంలో కాకినాడకు చెందిన సంకురాత్రి చంద్రశేఖర్ కు పద్మశ్రీ వరించింది. ఓఆర్ఎస్ సృష్టికర్త దిలీప్ కుమార్ కు పద్మవిభూషణ్ తో కేంద్రం గౌరవించింది. రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు పంపినా కేంద్రం పట్టించుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి.