»Nirmala Sitharaman Sensational Comments Telangana Is Top In Debt In India
Nirmala Sitharaman: అప్పుల్లో తెలంగాణ టాప్..పార్లమెంట్లో స్పష్టం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కుప్పగా మారిందని విపక్షాలు విమర్షస్తున్నాయి. సౌత్ ఇండియాలో రుణాలు తీసుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం నెం 1 స్థానంలో ఉందని నిర్మల సీతారామన్ పార్లమెంట్లో స్పష్టం చేశారు.
Nirmala Sitharaman: వర్షకాల పార్లమెంట్(parliament session) సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విపక్షాలన్నీ మూకుమ్మడిగా విమర్శిస్తున్నాయి. అప్పులు చేసి సంక్షేమ పథకాల పేరుతో భారీగా ఖర్చులు చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. విపక్షాలకు దీటుగా బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు(MP Nama Nageswara Rao) లోక్‌సభలో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల అప్పుల గురించి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానం విపక్షాల ఆరోపణలకు మరింత బలం చేకూర్చింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రిజర్వు బ్యాంకు(Reserve Bank) ద్వారా తీసుకున్న అప్పుల భారం రూ. 1.90లక్షల కోట్లుగా ఉన్నదని, 2023-24 ఆర్థిక సంవత్సరం ఎస్టిమేట్స్ ప్రకారం అది రూ. 3.66 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఆమె వివరించారు. కర్ణాటక అప్పు సైతం రూ. 2.86 లక్షల కోట్ల నుంచి రూ. 5.35 లక్షల కోట్లకు చేరుకున్నదన్నారు. కానీ గతేడాదితో పోల్చినప్పుడు సౌతిండియా రాష్ట్రాల్లో తెలంగాణ 16.6 శాతంతో టాప్(top) ప్లేస్‌లో ఉన్నదని తెలిపారు. రాష్ట్ర జీఎస్డీపీని పరిగణనలోకి తీసుకుని ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం ఆర్బీఐ నుంచి తీసుకున్న రుణాలను మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఈ సమాధానంలో వివరించింది. వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పుల గురించి ఇంకా పూర్తి వివరాలను వెల్లడించలేదు. నాబార్డు ద్వారా మౌలిక సదుపాయాల అభివృద్ధి సహాయక నిధి కింద అదనంగా మరో రూ. 8,463.18 కోట్లను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. ఇందులో రూ.6,528.95 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 2019-2023 మధ్యకాలంలో తీసుకుంది. ఈ ఐదేండ్లలో అంతకుముందు సంవత్సరాలతో పోలిస్తే ప్రతీ ఆర్థిక సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం సగటున 18 శాతం చొప్పున అప్పులు తీసుకుంటునే ఉందని వెల్లడించారు.
దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోల్చితే ఒడిశా(Odisha) రాష్ట్రం మాత్రమే తక్కువ రుణం తీసుకుంటూ నెగెటివ్‌లో ఉంది. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)తో పోల్చినా తెలంగాణ ప్రభుత్వం ఈ ఐదేండ్లలో ఎక్కువ అప్పే తీసుకున్నదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రుణ భారం 2019లో రూ. 2.64 లక్షల కోట్లు ఉంటే 2023-24 అంచనా లెక్కలతో అది వచ్చే ఏడాది మార్చి నాటికి రూ. 4.42 లక్షల కోట్లకు చేరుకోనున్నది.
ఇక తెలంగాణ ఏర్పడినప్పటి నుంచీ అటు రిజర్వు బ్యాంకు నుంచి ఎఫ్ఆర్బీఎం ప్రకారం తీసుకునే రుణాలతో పాటు కార్పొరేషన్ల ద్వారా కూడా ప్రభుత్వ గ్యారంటీతో తీసుకునే అప్పులు దాదాపు 5.5 లక్షల కోట్లకు చేరుకున్నట్లు అంచనా. ఇందులో ప్రతీ సంవత్సరం వడ్డీల కోసమే వేలాది కోట్ల రూపాయలను చెల్లిస్తూ ఉన్నది. గతేడాది సుమారు రూ. 18 వేల కోట్లు కేవలం వడ్డీలకు చెల్లించనున్నట్లు బడ్జెట్లో పేర్కొంటే ఈసారి అది రూ. 22 వేల కోట్లకు పెరిగింది. దీనికి తోడు ఈ సంవత్సరం నుంచి కాళేశ్వరం, మిషన్ భగీరథ రుణాల రీపేమెంట్ కూడా మొదలైంది. సుమారు రూ. 12 వేల కోట్లను చెల్లించాల్సి వస్తుందని బడ్జెట్లో లెక్కలు వేసుకున్నది. దేశం మొత్తం మీద గతేడాది కంటే ఎక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రం రాజస్థాన్ మొదటి ప్లేస్‌లో ఉంటే, తెలంగాణ రెండవ స్థానంలో ఉందని నిర్మాల సీతారామన్ వివరించారు.