»New Elements In Hyderabad Terrorism Five Members Arrested By Mp Police
Hyderabad: ఉగ్రకోణంలో కొత్త అంశాలు..కూల్చివేతకు కుట్ర
హైదరాబాద్లో ఉగ్రకుట్రలు పన్నుతున్నారనే ఆరోపణలతో నిన్న ఐదుగురిని ఏటీఎస్ పోలీసులు(ats police) అరెస్టు చేశారు. అయితే వారిని మధ్యప్రదేశ్ తీసుకెళ్లిన ప్రతినిధులు కీలక విషయాలను వెల్లడించారు. వీరంతా పెద్ద ప్లాన్ వేసినట్లు తెలిపారు.
హైదరాబాద్లో నిన్న టెర్రరిస్టుల అరెస్టు తర్వాత కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ గ్రూపునకు ప్రధాన సూత్రదారి అయిన మొహమ్మద్ సలీంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే సలీం డెక్కన్ ఇంజినీరింగ్ కాలేజీలో బయోటెక్నాలజీ విభాగానికి HODగా ఉన్నారు. మరోవైపు ఈ కాలేజీ తెలంగాణకు చెందిన ఓ ప్రజాప్రతినిధిది కావడం చర్చనీయాంశంగా మారింది. ఇంజినీరింగ్ కాలేజీలో పనిచేస్తున్న సలీం..టెర్రరిస్టులతో లింకులు పెట్టుకున్నాడనే ఆరోపణలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.
అంతేకాదు సలీంతోపాటు అబ్దుర్ రెహ్మాన్, అబ్బాస్ అలీ, షేక్ జునైద్, మహ్మద్ హమీద్ వంటి ఐదుగురిని హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి మధ్యప్రదేశ్ లోని భోపాల్ తీసుకెళ్లారు. ఆ క్రమంలో సలీం నుంచి రెండు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. అయితే హిందువైన సలీం తన మతం మార్చుకుని ముస్లింగా మారినట్లు తెలిసింది.
16 మందిని మధ్యప్రదేశ్ పోలీసుల యాంటీ టెర్రరిజం స్క్వాడ్ మంగళవారం అరెస్టు చేయగా, మరో ఐదుగురిని హైదరాబాద్లో హిజ్బ్-ఉత్-తహ్రీర్ అనే రాడికల్ సంస్థతో అనుమానిత సంబంధాలున్నాయని అరెస్టు చేసినట్లు ఎంపీ పోలీసు ప్రతినిధి తెలిపారు. అరెస్టయిన వారిలో జిమ్ ట్రైనర్, టీచర్, ఆటోడ్రైవర్, టైలర్, కంప్యూటర్ టెక్నీషియన్, వ్యాపారవేత్త, సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉన్నారని వారు అటవీ ప్రాంతాల్లో రహస్య పోరాట శిక్షణ శిబిరాలు నిర్వహించేవారని పేర్కొన్నారు.
వీరు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడేందుకు ప్లాన్(plan) చేస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాదు వీరు 50కి పైగా దేశాల్లో నెట్వర్క్ విస్తరించి ఉన్న HUTలోని అరెస్టయిన సభ్యుల నుంచి దేశ వ్యతిరేక కర్యకలాపాలకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఆ క్రమంలో పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు రాడికల్ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
భారతదేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థను కూల్చివేసి, దాని స్థానంలో షరియా (ఇస్లామిక్ చట్ట పాలన)ని తీసుకురావాలని ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకుందని ఎంపీ పోలీసు(mp police) ప్రతినిధి పేర్కొన్నారు. అంతేకాదు మధ్యప్రదేశ్లో వారి కార్యకర్తలను సృష్టించి హింసకు ప్రేరేపించేందుకు ఈ సంస్థ పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. హైదరాబాద్కు చెందిన నిష్ణాతులైన శిక్షకుల నుంచి శిక్షణ పొందారని తెలిపారు.
అంతేకాకుండా వారు మతపరమైన సమావేశాలలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసేవారని, ఎక్కువ మంది యువకులకు మతపరమైన సాహిత్యాన్ని పంపిణీ చేసేవారని ప్రతినిధి చెప్పారు. వారు కమ్యూనికేషన్ కోసం సాధారణ ఛానెల్లను నివారించారని, సంభాషణ కోసం డార్క్ వెబ్లను ఉపయోగించారని అన్నారు. ఈ HUT సభ్యులు భారతదేశంలోని పెద్ద నగరాలను భయాందోళనలు సృష్టించేందుకు రద్దీగా ఉండే ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలకు పాల్పడుతున్నట్లు గుర్తించారని ఆయన వెల్లడించారు.