అధికారంలో ఉన్న బీజేపీకి ఊహించని ఫలితం దక్కింది. ఖాళీగా ఉన్న 5 స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఒక్కటే స్థానం దక్కించుకోగా.. ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందగా.. ప్రతిపక్ష కూటమి మూడింటిని చేజిక్కించుకుంది. దీంతో మహారాష్ట్రలోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. మూడు స్థానాలు ఖాతాలో వేసుకున్న మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) సత్తా చాటింది. నాగ్ పూర్, ఔరంగాబాద్, అమరావతి స్థానాలు ఎంవీఏ కూటమి ఖాతాలో చేరాయి. కొంకణ్ స్థానంలో మాత్రమే బీజేపీ అభ్యర్థి ధ్యానేశ్వర్ మాత్రె విజయం సాధించాడు.
బీజేపీ సిట్టింగ్ స్థానమైన అమరావతి డివిజన్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని ప్రతిపక్ష కూటమిలోని కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంది. జనవరి 30న పోలింగ్ జరిగగా శుక్రవారం ఫలితాలు వెల్లడయ్యాయి. నాసిక్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి సత్యజిత్ తాంబే విజయం సాధించాడు. అయితే ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. ఇప్పుడు విజయం సాధించడంతో ఆయన కాంగ్రెస్ లోకి వెళ్తారా? లేదా బీజేపీలోకి వెళ్తారా అనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీ పాలనతో ప్రజలు విసిగెత్తిపోయారని చెప్పడానికి ఈ ఫలితాలే నిదర్శనమని ఎంవీఏ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. భవిష్యత్ లో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కూటమి విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, శివసేన (ఉద్దవ్ ఠాక్రే), ఎన్సీపీ కలిసి మహా వికాస్ అఘాడీ పేరుతో కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. శివసేనను చీల్చి ఆ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుని ఏక్ నాథ్ షిండే బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ఏక్ నాథ్ షిండేనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు.