తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా…కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన చెరువుల పండుగలో అపశ్రుతి చోటు చేసుకుంది. కరీంనగర్ రూరల్ మండలం ఆసిఫ్‌నగర్ ఊరు చెరువు వద్ద నిర్వహించిన చెరువుల పండుగకు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు. అదే క్రమంలో కార్యక్రమం నిర్వహిస్తుండగా చెరువులో ఉన్న నాటు పడవ ఎక్కాలని స్థానిక బీఆర్ఎస్ కార్యకర్తలు కోరారు. అసలే మంత్రి బరువు ఎక్కువగా ఉంటారు. ఆ నేపథ్యంలోనే ఆయన పడవ ఎక్కుతుండగా అది ఒక్కసారిగా ఒక వైపు ఒరిగింది. దీంతో బ్యాలెన్స్ కోల్పోయిన మంత్రి గంగుల కమలాకర్ నీటిలో బొక్కా బోర్లా పడ్డారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అక్కడే ఉన్న పోలీసులు, బాడీగార్డులు వెంటనే చెరువులోకి దిగి ఆయనను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
అయితే ప్రమాదవశాత్తు మంత్రికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అంతకుముందు చామన్ పల్లి గ్రామంలో ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్.. గ్రామంలోని అప్పనపల్లి చెరువు వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మలతో మంత్రి గంగులకు స్వాగతం పలుకగా మంత్రి స్వయంగా బతుకమ్మను ఎత్తుకొని చెరువు వద్దకు చేరుకున్నారు.