Russia: రష్యాలో చెలరేగిన సైనిక తిరుగుబాటు..వాగ్నర్ గ్రూప్ వార్నింగ్
వాగ్నర్ గ్రూప్ సైనిక హెలికాప్టర్‌ను తన బలగాలతో పుతిన్ బృందం కూల్చివేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో వాగ్నర్ సైనికులకు పుతిన్ వర్గానికి మధ్య అంతర్గత యుద్ధం జరిగే అవకాశం ఉంది. రష్యా అంతటా పుతిన్ సర్కార్ హైఅలర్ట్ ప్రకటించింది.
రష్యా(Russia), ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధం వల్ల భారీ నష్టం వాటిళ్లింది. ఇరు దేశాల్లో వేలాది మంది తమ ప్రాణాలను కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులవ్వగా మరికొందరు క్షతగాత్రులై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అంతర్జాతీయంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తినా పుతిన్ తీరులో మార్పు రాలేదు. అయితే తాజాగా పుతిన్‌కు వ్యతిరేకంగా సైనిక తిరుగుబాటుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
రష్యాలో ప్రైవేట్ మిలిటరీ సేవలు అందించే ‘వాగ్నర్’ బృందం పుతిన్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేందుకు సిద్దమైందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి. దీంతో పుతిన్ వర్గంలో టెన్షన్ మొదలైంది. రాబోయే పరిణామాలపై సైన్యం సిద్ధంగా ఉండాలని పుతిన్ తన సైన్యానికి పిలుపునిచ్చినట్లు సమాచారం. వాగ్నర్ఫైటర్స్, ప్రైవేట్మిలిటరీ బృందానికి అధిపతి అయిన యెవ్జెనీ ప్రిగోజిన్.. రష్యా ప్రభుత్వ తీరుపై కొన్ని రోజులుగా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
యుద్ధం పేరుతో రష్యా రక్షణ శాఖ తన దళంలోని చాలా మందిని చంపిందని, దానికి ప్రతీకారం తీర్చుకుంటానని ప్రిగోజిన్ తేల్చి చెప్పారు. తమకు అడ్డొచ్చిన వారిని వదిలిపెట్టమని హెచ్చరించారు. ఆఖరికి రష్యా సైనిక నాయకత్వాన్ని కూల్చేందుకు అయినా తాను సిద్దమని శనివారం వాగ్నెర్ మెర్సెనరీ గ్రూప్ అధిపతి శపథం చేశారు. దీంతో రష్యాలో పుతిన్ సర్కార్ హైఅలర్ట్ ప్రకటించింది. దేశం అంతటా భారీ ఎత్తున బలగాలను మోహరించింది. ఈ తరుణంలో వాగ్నర్ బృందం హెలికాప్టర్‌ను తన బలగాలతో పుతిన్ సైనికదళం కూల్చివేసింది. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.