షార్ట్ సర్క్యూట్ కారణంగా అమర్‌రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు, జాతీయ రహదారిపై కలకలం రేపింది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం ఏర్పడగా.. కార్మికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మోర్దానపల్లెలో జాతీయ రహదారి పక్కన అమర్‌రాజా ఫ్యాక్టరీ ఉంది. 150 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పరిశ్రమలో బ్యాటరీలు తయారు చేస్తుంటారు.
సోమవారం రాత్రి సమయంలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడడంతో అందులో పని చేసే ఉద్యోగులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే కార్మికులు బయటకు తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. మూడు ఫైరింజన్లు మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటున్నారు. అయితే ఆస్తి నష్టం ఎంత అనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఈ పరిశ్రమ ఏపీకి చెందిన తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ కు సంబంధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కంపెనీ విషయంలో ఏపీలోని అధికార పక్షానికి, ప్రతిపక్షానికి మధ్య వివాదం కొనసాగుతోంది.