»Komatireddy Venkat Reddy Hope Brs And Congress Government Next
Komatireddy: హంగ్, బీఆర్ఎస్-కాంగ్రెస్ దోస్తీ అంటూ సంచలనం
నల్గొండ పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుందని బాంబు పేల్చారు. వచ్చే ఎన్నికల అనంతరం బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో కలిసి వెళ్లదని, అలాంటి సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు.
నల్గొండ పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుందని బాంబు పేల్చారు. వచ్చే ఎన్నికల అనంతరం బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో కలిసి వెళ్లదని, అలాంటి సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో ఐక్యత లేకపోవడం వల్లే పార్టీ ఇలా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్ ఫోన్ చూసుకునేవారు తప్ప పార్టీని పట్టించుకున్న సందర్భాలు లేవన్నారు. నేతలు అందరూ ఒక్కతాటి పైకి వస్తే తప్ప గెలవలేమన్నారు. అయితే పార్టీలో పాత కాంగ్రెస్ నేతలు ఇరవై శాతంమంది కూడా లేరని, ఇప్పుడు కొత్త ఇంచార్జ్ వచ్చాక పార్టీ సెట్ అవుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి 60 సీట్లు రావని, ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప కాంగ్రెస్‌కు మెజార్టీ రాదన్నారు. ఒంటరిగా ఏ పార్టీ కూడా గెలిచే అవకాశం లేదన్నారు. కాంగ్రెస్ 40 నుండి 50 స్థానాలు గెలుచుకోవచ్చునని జోస్యం చెప్పారు. మెజార్టీ రాకపోయినా బీఆర్ఎస్తో కలిసి అధికారంలో ఉంటామన్నారు. బీజేపీని మతతత్వ పార్టీ అని విమర్శిస్తారు కాబట్టి బీఆర్ఎస్, కాంగ్రెస్ కమలంతో కలిసే అవకాశాలు లేవు. కనుక ఈ తమ కాంగ్రెస్, బీఆర్ఎస్ కలువవచ్చునన్నారు.
పార్టీలో ఎవరో ఒకరు వచ్చి నేను గెలిపిస్తాను.. అంటే కుదరదని మరోసారి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆయనే గెలిపిస్తాడు కదా… అని మిగతా వాళ్లు ఊరుకుంటారని చెప్పారు. నేను గెలిపిస్తా అని చెబుతున్న వ్యక్తి ఎవరో అందరికీ తెలిసిందేనని అన్నారు. అయితే కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత రావు స్పందించారు. ఇలాంటి సమయంలో కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఎనిమిదేళ్లుగా కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని, కాబట్టి మనం వారిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలన్నారు. ఎన్నికల సమయంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడటం సరికాదన్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు నష్టం చేసేలా ఉందని అద్దంకి దయాకర్ అన్నారు. పొత్తులపై మాట్లాడేందుకు అధిష్టానం ఉందన్నారు.
బిగాల గణేష్ ఆగ్రహం
కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త స్పందించారు. కాంగ్రెస్‌ది దింపుడు కళ్లెం ఆశ అని, వారి పార్టీతో ఎట్టి పరిస్థితుల్లోను కలిసే ప్రసక్తి లేదన్నారు. మాకు ప్రజలపై నమ్మకం ఉందని, వంద సీట్లకు పైగా గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కోమటిరెడ్డికి తన పార్టీ పైన, పార్టీ అధ్యక్షుడి పైన నమ్మకం లేదని, ఆ పార్టీలో గ్రూప్ రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయని, అసలు ఆయనకే పార్టీలో దిక్కుముక్కు లేదని, అలాంటి వ్యక్తి మా బీఆర్ఎస్ గురించి మాట్లాడితే ఎలా అన్నారు. ఆసలు ఆయన బీజేపీ కోసం పని చేస్తున్నారా.. కూడా అర్థం కావడం లేదన్నారు. ఆయన వాళ్ల పార్టీ గురించి మాట్లాడుకోవచ్చునని చెప్పారు.
బండి సంజయ్ స్పందన
ఎన్నికలు సమీపించే వరకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కొట్టుకున్నట్లుగా యాక్ట్ చేస్తాయని, ఆ తర్వాత ఇద్దరు కలిసి వస్తారన్నారు. బీజేపీని అడ్డుకునేందుకు ఈ దండుపాళ్యం ముఠా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. ఒకరు దేశాన్ని దోచుకుంటే, మరొకరు రాష్ట్రాన్ని దోచుకున్నారని కాంగ్రెస్, బీఆర్ఎస్లను ఉద్దేశించి అన్నారు. మోడీ మాత్రం నిజాయితీతో కూడిన పాలనను అందిస్తున్నారన్నారు.