Kodali Nani: షాకింగ్… జగన్ పతనం కోరుకున్న వైయస్ వివేకా
వివేకానంద రెడ్డి బతికి ఉన్నా.. చనిపోయినా తమ పార్టీ అధినేత వైయస్ జగన్ కడప లోకసభ స్థానాన్ని అవినాశ్ రెడ్డికే ఇచ్చేవారని స్పష్టం చేశారు. ఇందుకు కారణం కూడా ఉందని చెప్పారు. జగన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, కడప ఎంపీగా, వైయస్ విజయమ్మ ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో వివేకానంద, కుటుంబం ప్రత్యర్థి పార్టీ తరఫున నిలిచారని గుర్తు చేశారు. సొంత అన్న కొడుకును, వదినను ఓడించేందుకు ప్రయత్నించారన్నారు.
దివంగత వైయస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy), ఆయన కుటుంబంపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) సోమవారం రాత్రి సంచలన వ్యాఖ్యలు చేసారు. వైయస్ వివేకా హత్య కేసును సీబీఐ విచారిస్తున్న విషయం తెలిసిందే. దీని వెనుక అధికార పార్టీ కీలక నేతలు ఉన్నారని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (Telugudesam) ఆరోపిస్తోంది. ఇందుకు సంబంధించి ఇటీవల జగనాసుర అనే పుస్తకాన్ని కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతలు.. టీడీపీపై మండిపడుతున్నారు. సోమవారం నాని తీవ్రంగా స్పందించారు. అదే సమయంలో వైయస్ వివేకా కుటుంబంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ మాజీ మంత్రి. తాడేపల్లిలో జగన్ నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వివేకానంద రెడ్డి బతికి ఉన్నా.. చనిపోయినా తమ పార్టీ అధినేత వైయస్ జగన్ (YS Jagan) కడప (Kadapa) లోకసభ స్థానాన్ని అవినాశ్ రెడ్డికే (Avinash Reddy) ఇచ్చేవారని స్పష్టం చేశారు. ఇందుకు కారణం కూడా ఉందని చెప్పారు.
జగన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, కడప ఎంపీగా, వైయస్ విజయమ్మ (ys vijayamma) ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో వివేకానంద, కుటుంబం ప్రత్యర్థి పార్టీ తరఫున నిలిచారని గుర్తు చేశారు. సొంత అన్న కొడుకును, వదినను ఓడించేందుకు ప్రయత్నించారన్నారు. వీరు జగన్ పతనం కోరుకున్నారన్నారు. కానీ అవినాష్ రెడ్డి (avinash reddy), ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి మొదటి నుండి జగన్ వెంటే నడిచారని, వారి విజయం కోసం పని చేశారని చెప్పారు. అలాంటప్పుడు జగన్ వారికే సీటు ఇస్తారని, అది ఆయన ఇష్టమని తేల్చి చెప్పారు. వివేకా చనిపోతే జగన్కు ఏమైనా ఆస్తి వస్తుందా అని ప్రశ్నించారు. ఆస్తులన్నీ వివేకా భార్య, కుమార్తె, అల్లుడి పేర్ల మీదే బదలాయించారని తెలిపారు. వివేకానంద హత్య తర్వాత దినం ఖర్చులు.. కాఫీ, టీ ఖర్చులు తప్పితే జగన్కు కలిసి వచ్చిందేమీ లేదన్నారు. ఆయన మరణంతో జగన్కు ముఖ్యమంత్రి పదవి వచ్చిందా? లేకపోతే పార్టీ అధ్యక్ష పదవి వచ్చిందా? అని సూటిగా ప్రశ్నించారు.
వివేకా మృతి సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడం వల్లే సీబీఐ (cbi) విచారణ కోరామని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక నిష్పక్షపాతంగా విచారణ చేస్తామని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో దర్యాప్తు పక్కదారి పడుతుందని సీబీఐ విచారణకు డిమాండ్ చేసినట్లు చెప్పారు. తమ ప్రభుత్వంలో విచారణ సజావుగా సాగుతుందనే కేంద్ర సంస్థ దర్యాప్తు అవసరం లేదని చెబుతున్నామన్నారు. 2019 ఎన్నికలకు ముందు వివేకా హత్య కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ హత్య వెనుక కీలక నేతలు ఉన్నారని, ఎన్నికల్లో సానుభూతి కోసం ఈ హత్య జరిగిందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తూ వస్తోంది. దీంతో చంద్రబాబు హయాంలో ఈ కేసును సీబీఐకి అప్పగించాలని వైసీపీ పట్టుబట్టింది. 2019 ఎన్నికల్లో గెలిచి, వైసీపీ అధికారంలోకి రావడంతో కేసు విచారణను రాష్ట్రమే చేస్తోంది. ఇప్పుడు టీడీపీ సీబీఐ విచారణ కోరుతోంది.