Jds 12 promise:కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు బిజీగా ఉన్నాయి. ఓ వైపు అభ్యర్థులను ప్రకటిస్తూనే.. మరోవైపు తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెబుతున్నాయి. బెంగళూరు పద్మనాభ నగర్లో గల తన నివాసంలో జేడీఎస్ నేత హెచ్డీ దేవే గౌడ (deve gowda) 12 హామీలతో కరపత్రం విడుదల చేశారు. దేవే గౌడతో ఆయన తనయుడు, మాజీ సీఎం కుమారస్వామి (kumara swamy), జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సీఎం ఇబ్రహీం (ibrahim) ఉన్నారు.
మాతృ శ్రీ, మహిళా సాధికారత కార్యక్రమాలు, స్వయం సహాయక మహిళ సంఘాలకు రుణ మాఫీ, వితంతు పెన్షన్ పెంపు, ఏడాదికి 5 ఉచితంగా సిలిండర్ల పంపిణీ, రైతు చైతన్య, వికలచేతనర ఆసర, లాయర్ల ప్రోత్సాహకాల పెంపు, పోలీసుల సిబ్బందికి విద్య, ఆరోగ్యం, మైనార్టీలు, షెడ్యూల్ కులాలు, యువత సాధికారత ఉన్నాయి. తమ పార్టీకి సంబంధించి మేనిఫెస్టోను తర్వాత విడుదల చేస్తామని హెచ్డీ దేవేగౌడ తెలిపారు. మిగతా అభ్యర్థుల జాబితాను ఇబ్రహీంతో చర్చించి కుమారస్వామి విడుదల చేస్తారని పేర్కొన్నారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి పార్టీలో ఎలాంటి సమస్య లేదని చెప్పారు.
తమ కృషి వల్లే వాల్మీకులకు ఎస్టీ రిజర్వేషన్లు కల్పించారని హెచ్డీ దేవే గౌడ (deve gowda) గుర్తుచేశారు. గ్రామీణ వొక్కలిగాలను వెనకబడిన వారీగా గుర్తించి 9 శాతం రిజర్వేషన్ కల్పించిందని తెలిపారు. ముస్లింలకు 4 శాతం, అత్యంత వెనకబడిన వర్గాలకు 1 శాతం, వొక్కలిగాలకు 4 శాతం రిజర్వేషన్ ఇచ్చామని పేర్కొన్నారు. అన్నదాత కుమారుడిని పెళ్లి చేసుకుంటే రూ.2 లక్షలు ఇస్తామని ప్రచారంలో కుమారస్వామి హామీఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ హామీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉండే అవకాశం ఉంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్లు ఫైల్ చేసేందుకు ఆఖరు తేదీ ఈ నెల 20 కాగా.. వచ్చే నెల 10వ తేదీన ఓకే విడతలో ఎన్నిక జరగనుంది. 13వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి.. అదే రోజు ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు.